YOUNG HERO SUDHEER VARMA : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విశాఖపట్నంలోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 18న రాత్రి సమయంలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించగా.. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి విశాఖలోని ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.
ఎల్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు, బంధువులు తెలిపారు. సుధీర్ బాబు మృతదేహాన్నిఅభిమానులు, బంధువుల సందర్శన అనంతరం దహన సంస్కారాలు నిర్వహించారు. విషం తీసుకుని సుధీర్‌వర్మ చనిపోయినట్టుగా ఎల్జీ ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో చనిపోయినట్టు మరణ నివేదికలో పేర్కొన్నారు.
సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విశాఖలోని సుధీర్ వర్మ ఇంటికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపకుండా నేరుగా కుటుంబసభ్యులకు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సుధీర్ వర్మ.. రాఘవేంద్ర రావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో నటించారు. ఇంకా సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు వంటి చిత్రాల్లోనూ నటించారు. ప్రైవేటు యాడ్స్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచుకున్నాడు సుధీర్. ఇక సుధీర్ మృతి విషయాన్ని కుందనపు బొమ్మ' సినిమాలో ఆయనతో కలిసి నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్ మరణం దిగ్భ్రాంతికరమని.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. సుధీర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇవీ చదవండి: