Today Appanna Swamy Theppotsavam: పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకుని నేడు విశాఖపట్నం జిల్లా సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి తెప్పోత్సవం అడివి వరంలోని వరాహ పుష్కరిణిలో వైభవోపేతంగా జరగనుందని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు స్వామివారు వేణుగోపాలుడి అలంకరణలో సింహగిరిపై నుంచి మెట్లమార్గంలో కొండ దిగువకు తరలిరానున్నారన్నారు. ఆ తరువాత తొలిపావంచా నుంచి ఊరేగింపుగా వరాహ పుష్కరిణి వద్దకు చేరుకుంటారని పేర్కొన్నారు.
ఆ తరువాత నౌకా విహారంలో పాల్గొని.. చెరువు మధ్యలోని ఉద్యాన మండపంలో స్వామివారు విశేష పూజలు, ఆరాధనలు అందుకొని, మళ్లీ అక్కడి నుంచి సర్వజన మనోరంజని వాహనంపై అడివివరం ప్రధాన వీధుల్లో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారని తెలియజేశారు. అనంతరం తిరిగి సింహగిరికి చేరుకుంటారని వివరాలను వెల్లడించారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఈవో త్రినాథరావు ఆధ్వర్యంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారు విహరించే నౌకను శుక్రవారం చెరువులో ట్రయల్ రన్ నిర్వహించారు. అప్పన్న స్వామి నౌకా విహారోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం గంటల 6 వరకే సింహగిరిపై స్వామివారి దర్శనాలు భక్తులకు లభిస్తాయని తెలియజేశారు. ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి యథావిధిగా స్వామివారి దర్శనాలను ప్రారంభమౌతాయని పేర్కొన్నారు.
ఈఈ రాంబాబు బోట్ల ఏర్పాట్లపై మాట్లాడుతూ.. 15 మంది గజ ఈతగాళ్లను, భద్రతా బోట్లను ఏర్పాటు చేశామన్నారు. 25 మంది పోలీసులతో చెరువు వద్ద బందోబస్తును ఏర్పాటు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టామని.. ఎస్ఐ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ట్రస్టీలు వారణాసి దినేశరాజ్, శ్రీదేవి వర్మ, సువ్వాడ శ్రీదేవి, గోపాలపట్నం ఎస్ఐ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి