పిడుగు శబ్దం మన చెవిని చేరడానికి.. 5సెకన్ల ముందే అది నేలవైపు దూసుకొస్తుంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 7.71 లక్షల పిడుగులు పడటం గమనార్హం. వాటిలో గరిష్ఠంగా మేలో 2.17 లక్షలు, జూన్‌లో 1.38 లక్షలు ఉన్నాయి. గతేడాది నెల్లూరు జిల్లాలో మూడు నెలలు, 2018లో కర్నూలు జిల్లాలో మూడు నెలలు, 2017లో ప్రకాశంలో నాలుగు నెలలపాటు పిడుగుల మోత మోగింది.
నెల్లూరులో అత్యధిక మరణాలు
ఏపీలో నాలుగేళ్లలో 328 మంది పిడుగులకు బలయ్యారు. వీటిలో నెల్లూరు(54 మంది), గుంటూరు(47), విశాఖపట్నం(42), ప్రకాశం(39) తొలివరుసలో ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో ముగ్గురు, ఏప్రిల్‌లో 21, మేలో 16, జూన్‌లో పది మంది పిడుగుపాటుకు బలయ్యారు. ఇటీవల ప్రకాశం జిల్లాలోనూ ఇద్దరు చనిపోయారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలోనే 8మంది, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. పురుషులు ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. 2018లో చోటుచేసుకున్న 137 మరణాల్లో పురుషులు 104, మహిళలు 33 మంది ఉన్నారు.
45 నిమిషాల ముందే హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణశాఖ నాలుగేళ్ల కిందట ఎర్త్ నెట్‌వర్క్స్‌తో ఒప్పందం చేసుకుని... రాష్ట్రంలో 12చోట్ల సెన్సార్లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం(ఎస్‌ఈఓసీ) ద్వారా పిడుగులు పడనున్న ప్రాంతాలను గుర్తించి... చుట్టూ 2కిలోమీటర్ల పరిధిలోని ప్రజలతోపాటు అధికారులందరి బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌ఫోన్లకు సమాచారం అందిస్తోంది. భారత వాతావరణశాఖ సైతం 5రోజుల వాతావరణ సమాచారంలో భాగంగా పిడుగులు పడే ప్రాంతాల వివరాలను వెల్లడిస్తోంది. ఈ సందేశాలు అందుతున్నా.. క్షేత్రస్థాయిలో సరిపడా తక్షణ స్పందన ఉండటం లేదు.
అలారం మోతతో అప్రమత్తం చేసేలా...
ప్రజల్ని మరింత అప్రమత్తం చేసేందుకు హెచ్చరికలు జారీ చేసిన తక్షణమే క్షేత్రస్థాయిలోనూ అలారం మోగే విధానాన్ని విపత్తుల నిర్వహణ శాఖ పరిశీలిస్తోంది. వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకే సందేశాలిస్తున్నాం. మిగిలిన సంస్థలు ముందుకు రాలేదు. అందుకే కొత్త విధానం పరిశీలిస్తున్నామ’ని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. పిడుగుపాటు హెచ్చరికలు అందిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: కష్టమంటే చాలు.. ఇంట్లో మనిషైపోతున్నాడు సోనూసూద్