ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జి.మాడుగులలో ముగ్గురు మిలీషియా సభ్యుల అరెస్ట్' - విశాఖ తాజా వార్తలు

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో మావోయిస్టులకు సహకరిస్తున్న ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు జి.మాడుగల అటవీ ప్రాంతంలో 12 మంది మావోయిస్టులకు సామాన్లు అందించారని డీఎస్పీ రాజ్​కమల్ తెలిపారు. పలుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టడానికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. చింతపల్లి మండలం వీరవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను హతమార్చేందుకు వీరు మావోయిస్టులకు సాయం చేస్తున్నారని చెప్పారు. ముగ్గురు మిలీషియా సభ్యులను 15 రోజులు రిమాండ్​కు తరలించామన్నారు.

డీఎస్పీ రాజ్​ కమల్
డీఎస్పీ రాజ్​ కమల్

By

Published : Jun 12, 2020, 12:02 PM IST

మావోయిస్టులకు సహకరిస్తున్న ముగ్గురు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు విశాఖ జిల్లా పాడేరు డీఎస్పీ రాజ్​కమల్ తెలిపారు. విశాఖ మన్యం జి.మాడుగుల మండలానికి చెందిన గెమ్మెలి భాస్కర్​రావు(అలియాస్ శ్రీను), పాలికి సూరిబాబు(అలియాస్ శుక్ర), గెమ్మెలి అర్జున్ అనే ముగ్గురు మిలీషియా సభ్యులు మవోయిస్టులకు కావాల్సిన సామాన్లు, భోజనాలు అందించారని చెప్పారు. పెదబయలు ఏరియా కమిటీ యాక్షన్ టీమ్ ఆధ్వర్యంలో జి.మాడుగుల మండల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో 12 మంది మావోయిస్టులను వీరు కలిశారని పేర్కొన్నారు. అంతేకాకుండా పలుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టడానికి సహకరిస్తున్నారని డీఎస్పీ చెప్పారు. జి.మాడుగుల పోలీసులు ముందస్తు సమాచారంతో వీరిని పట్టుకున్నారన్నారు. ముగ్గురు మిలీషియా సభ్యులను కోర్టులో హాజరుపరచగా... పాడేరు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారని డీఎస్పీ వెల్లడించారు.

మావోయిస్టులు చింతపల్లి మండలం వీరవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను మిలీషియా సభ్యుల సహకారంతో హతమార్చడానికి పన్నాగం పన్నారని డీఎస్పీ చెప్పారు. వీరవరంలో 2014లో మావోయిస్టులు సంజీవరావు అనే వ్యక్తిని చంపగా గ్రామస్థులు తిరగబడి శరత్ , గణపతి అనే మావోయిస్టులను కొట్టి చంపారు. ఆ సమయంలో కొంతమంది మావోయిస్టులు గాయపడ్డారు. ఈ ఘటనతో మావోయిస్టులు 2019 జూలై 18న వీరవరంలో పాంగి సత్తిబాబు, గెమ్మెలి భాస్కరరావులనే ఇద్దరు గ్రామస్థులను హతమర్చారు. ఆ సమయంలో మావోయిస్టులకు ఎదురు నిలిచిన గెమ్మెలి మహేష్ , రవి, బికునులను హతమార్చడానికి కుట్రపన్నారు.

ఏజెన్సీలోని గిరిజన యువత మావోయిస్టు మాటలు నమ్మి మోసపోవద్దని డీఎస్పీ రాజ్​కమల్ సూచించారు. మావోయిస్టులు గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు.

ఇదీ చదవండి :'అవినీతిని కప్పిపుచ్చేందుకే సీబీ'ఐ'.. ఏడాదంతా కుంభకోణాలే..!'

ABOUT THE AUTHOR

...view details