విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించిన రౌడీషీటర్ కె.సాయికుమార్ (33) హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి ఎంవీపీ పోలీసు స్టేషన్లో సోమవారం ద్వారకా ఏసీపీ ఆర్.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి వివరాలను వెల్లడించారు. అరిలోవ ప్రాంతానికి చెందిన కె.సాయికుమార్‌కు ఖాదర్ రియాజ్ (22), నమ్మి శ్రీనివాస్ అలియాస్ పండు(22), షేక్ సమీర్(24), ఓ 17 సంవత్సరాల బాలుడు స్నేహితులు. అతను చెప్పిన పనులను వీరు చేస్తుండటంతో వీరి మధ్య సన్నిహితం పెరిగింది. కొంతకాలంగా ఇతను మిగిలిన నలుగురిపై పెత్తనం చెలాయించటం, తరచూ గొడవలకు దిగటంతో వీరి మధ్య స్నేహబంధం చెడింది.
కొన్ని విషయాల్లో వారితో విభేదిస్తుండటంతో అతన్ని అడ్డు తొలగించాలని భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 26న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో సాయికుమార్ తన అత్త ఇంటి నుంచి మరో స్నేహితుడు రాంబాబుతో కలిసి ద్విచక్రవాహనం వెళ్తున్నట్లు సమాచారం రావటంతో ఖాదర్ రియాజ్, పండు, సమీర్, బాలుడు కలిసి రాడ్‌లు, కత్తులతో దారి కాశారు. టి.ఐ.సి. పాయింట్ వద్దకు చేరుకోగానే, అక్కడే మాటు వేసిన వీరు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. తలపై ఇనుపరాడ్‌తో రియాజ్, పండు బలంగా కొట్టగా, బాలుడు కత్తితో దాడి చేశారు. సాయితో పాటు ఉన్న స్నేహితుడు రాంబాబు కూడా గాయాలపాలయ్యాడు.