ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో అలజడి ... పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు - ఏవోబీ లంబసింగిలో గంజాయి స్మగ్లర్లపై నల్గొండ పోలీసులవేట

పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు
పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు

By

Published : Oct 17, 2021, 6:33 PM IST

Updated : Oct 18, 2021, 4:34 AM IST

18:31 October 17

గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న పోలీసు వాహనంపై రాళ్ల దాడి

గంజాయి స్మగ్లర్లపై కాల్పులు

     విశాఖ మన్యం నుంచి గంజాయి రవాణాదారులను తీసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం నల్గొండ పోలీసులు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో ఇద్దరు గిరిజనులు గాయపడ్డారు. దీనిపై స్థానికులు, చింతపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొద్దిరోజుల క్రితం నల్గొండ జిల్లాలో శ్రీను అనే వ్యక్తి గంజాయితో అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో ఇతర నిందితులను గుర్తించేందుకు నల్గొండ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శ్రీనుతో కలిసి చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి ఈ నెల 15న వచ్చారు. శనివారం మరోసారి వచ్చి గ్రామానికి చెందిన బాలకృష్ణ, లోవరాజులను అదుపులోకి తీసుకుని నర్సీపట్నంలో ఉంచారు. ఆదివారం మళ్లీ గాలిపాడు వెళ్లి, కిల్లో భీమరాజు అనే గిరిజనుడిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను వాహనం ఎక్కించుకుని నర్సీపట్నం వస్తున్నారు. గొర్రెల పెంపకంతో జీవిస్తున్న భీమరాజుకు గంజాయితో సంబంధం లేదని, పోలీసులతో మాట్లాడి అతన్ని విడిపించుకోవాలన్న ఉద్దేశంతో అన్నవరం సర్పంచి పాంగి సన్యాసిరావు, ఎంపీటీసీ సభ్యుడు కిలో వరహాలబాబు, మరో ఎనిమిది మంది కలిసి జీపులో పోలీసు వాహనాన్ని వెంబడించారు. తురబాల గెడ్డ సమీపంలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసు వాహనం ఆగింది. వెనకే వచ్చిన గ్రామస్థులు కొందరు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు. కొంతమంది పోలీసు వాహనంపై రాళ్లు రువ్వడంతో ఒక కారు అద్దాలు పగిలాయి. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనలో గాలిపాడుకు చెందిన తండ్రీ కొడుకులైన కిల్లో కామరాజు (55), కిల్లో రాంబాబు (25) కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వీరిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చింతపల్లి సీఐ, అన్నవరం ఎస్సై నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల వాంగ్మూలం తీసుకున్నారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

ఆత్మరక్షణ కోసమే కాల్పులు: నల్గొండ ఎస్పీ

నల్గొండ నేరవిభాగం: కాల్పులపై నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ స్పందించారు. ‘నాలుగు రోజులుగా అక్కడ గాలింపు జరుగుతోంది. ఆదివారం గంజాయి అమ్మకందారులను పట్టుకోవడానికి నకిరేకల్‌ సీఐ కె.నాగరాజు నేతృత్వంలోని బృందం గాలింపు చేపట్టింది. కొయ్యూరు మండలం తురబాల గెడ్డ ప్రాంతంలో నిందితులు ఉన్నట్లు తెలుసుకుని కూంబింగ్‌ ప్రారంభించారు. 30 మంది స్మగర్లు పోలీసు బృందాలపై రాళ్లదాడి చేయడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. మొదట గాలిలోకి, తర్వాత నిందితులపైకి కాల్పులు జరిపారు. కాల్పులలో ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి’ అని అన్నారు. అక్కడి పోలీసులకు ముందుగా చెప్పాకే గాలింపు చేపట్టినట్లు వివరించారు.

ఇదీ చదవండి:విశాఖలో మావోయిస్టు సభ్యురాలు కొర్రా కుమారి లొంగుబాటు

Last Updated : Oct 18, 2021, 4:34 AM IST

ABOUT THE AUTHOR

...view details