కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్లు... భూమాతకు చీర సింగారించినట్టుండే పచ్చని సోయగాలు... ఎటు చూసినా రమణీయత ఉట్టిపడేట్టుండే ముగ్ధ మనోహర దృశ్యాలు... వర్ణించలేని అందాలకు నెలవు విశాఖ మన్యం. ఈ సౌందర్యం మాటున ఓ హృదయ విదారకమైన జీవనం దాగుంది. మానవీయ కోణంతో చూడగలిగితే అక్కడి గిరిపుత్రుల వ్యథ కనిపిస్తుంది. ప్రశాంతతకు నిలువెత్తు నిదర్శనమైన అడవి తల్లి.. ఆ బిడ్డల కోసం రోదిస్తున్న కన్నీరు కళ్లకు కడుతుంది.
అడవినే నమ్ముకుని ...
సముద్రమట్టానికి సుమారు 3500 మీటర్ల ఎత్తులో ఉన్న విశాఖ ఏజెన్సీలో అడవినే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు గిరిపుత్రులు. కొండ భూముల్లో సాగు చేసుకుంటూ ఒకచోట నుంచి మరో చోటుకు వలస వెళుతుంటారు వీరంతా. పంటలకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుంటారు. అలా అందరూ తలోదారి వెతుక్కుంటూ కొండ లోయల్లోనే తలదాచుకుంటారు. ఇప్పుడిదే వీరిని కష్టాల కడలిలోకి నెట్టేసింది. లోయ ప్రాంతాలేవీ అభివృద్ధికి నోచుకోక... 50 ఏళ్ల క్రితం పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.
డోలీనే అంబులెన్స్...
గర్భిణీల అవస్థలైతే వర్ణనాతీతం. పురిటి నొప్పులు పడుతున్న సమయంలో... డోలీ కట్టి ఆస్పత్రికి తరలించిన సందర్భాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో...తల్లీబిడ్డలు ప్రమాద బారిన పడి మృతి చెందిన సంఘటనలూ అనేకం. ఈ నెల 5న పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని డోలి కట్టుకుని కొండ గుట్టలు, అటవీ మార్గం దాటుకుంటూ 7 కిలోమీటర్లు నడిచి అంబులెన్స్‌లో చేర్చారు. తల్లి క్షేమంగా ఉన్నప్పటికీ శిశువు మరణించింది. పాడేరు మండలం బంధపొలంలో... ఓ మహిళను డోలీపై మోస్తుండగా మార్గంలోనే ప్రసవమైంది. ఇటీవలే అనంతగిరి మండలంలో ఓ గర్భిణి నడుస్తున్న సమయంలో ప్రసవమై... శిశువు ఇసుకలో పడిపోయింది. ఇలాంటి ఘటనలెన్నో ఈ మన్యంలో వెలుగు చూస్తూనే ఉంటాయి.