విశాఖ జిల్లా పాతగోపాలపట్నం అనగానే అందరికి ముందు గుర్తుకు వచ్చే విషయం రైల్వే గేటు. అక్కడ ఎంతోమంది విసుక్కుంటూ వేచి ఉన్న అనుభావాలే ఉంటాయి. నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డు బాజీ జంక్షన్ నుంచి పాతగోపాలపట్నం మధ్య సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో తక్కువ ఎత్తు సబ్‌వేని వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు నిర్మించారు. పనులను మంగళవారం ఉదయం ప్రారంభించి.. సాయంత్రానికల్లా పూర్తి చేశారు.
ఆ ప్రాంతాలకు మేలు..
పదేళ్ల కిందటి మాట.. పాతపోస్టాఫీసు నుంచి బాజీ కూడలి, పాతగోపాలపట్నం మీదుగా చింతకట్ల వరకు ఓ ఆర్టీసీ బస్సు వెళ్లేది. అప్పట్లో గేటు వేస్తే గంట, గంటన్నరదాకా బస్సు ఆగిపోయేది. దీంతో ప్రజలు, ఆర్టీసీ అధికారులు విసిగెత్తిపోయేవారు. చివరకు 2009-10లో ఆ బస్సును రద్దు చేశారు. అప్పటి నుంచి ఆ రూట్లో బస్సులు తిరగలేదు.
- తాజాగా గేటు లేకుండా సబ్‌వే నిర్మించటంతో భారీ వాహనాలు కాకపోయినా కనీసం ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, ఇతర వాహనాలు అడ్డంకుల్లేకుండా వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.
- ఈ మార్గంలో పాతగోపాలపట్నం మీదుగా మహాత్మాఆదర్శనగర్, కొత్తపాలెం, నరవ, జెర్రిపోతులపాలెం, చింతకట్ల మీదుగా సబ్బవరం వైపు కూడా వెళ్లేందుకు మార్గాలున్నాయి.
- ప్రస్తుతం పాతగోపాలపట్నం పక్కనున్న రైలుమార్గాల ద్వారా రోజుకు 35 నుంచి 40 రైళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇవొచ్చినప్పుడల్లా గేటు పడుతుందనే బాధ తప్పినట్లవుతోంది.
- గత 10 ఏళ్లలో ఈ రైల్వేగేటు సమీపంలో 4 ప్రమాదాలు జరిగాయి. నలుగురు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రణాళికలో మరో రెండు..
పాతగోపాలపట్నం దాటాక మహాత్మాఆదర్శనగర్ సమీపంలో మరో రెండు గేట్లు ఉన్నాయి. ఇవి అతి కీలకమని స్థానికులు, ఇక్కడ కూడా సబ్‌వేలు నిర్మిస్తే కష్టాలు పూర్తిగా తీరినట్టేనని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వాల్తేరు అధికారుల దగ్గర ప్రస్తావించినప్పుడు.. ప్రస్తుతం ఉన్న నిధుల ప్రకారం మొదట ఒక సబ్‌వే నిర్మించామని, మిగిలినవి ప్రతిపాదన దశలో ఉన్నాయన్నారు. నిధులు సమకూరగానే వాటినీ నిర్మిస్తామని చెప్పారు. దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.