ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 28, 2020, 2:10 PM IST

ETV Bharat / state

అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం’

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి అన్ని అంగన్​వాడీ కేంద్రాల్లో 'వైఎస్సార్​ సంపూర్ణ పోషణ పథకం' పేరుతో మెనూలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఐసీడీఎస్‌ అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు.

YSR Complete Nutrition Scheme in all Anganwadi Centers from September 1
అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం’

చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి అన్ని అంగన్​వాడీ కేంద్రాల్లో 'వైఎస్సార్​ సంపూర్ణ పోషణ పథకం' పేరుతో మెనూలో సమూల మార్పులు చేయనుంది. ఈ మేరకు సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • అందరికీ ఆవగాహన

ఈ కొత్త పథకం అమలు తీరుతెన్నులపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అంగన్​వాడీ కేంద్రాల నిర్వాహకులు, వార్డు సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శులు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో అమలు చేసిన మెనూలో కొంతమేర మార్పులు చేశారు. ఈ సారి అదనంగా పాలు, గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు ఇవ్వనున్నారు. వైరస్ కారణంగా ఆహారపదార్థాలను ఇంటికి పంపేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.

విశాఖ జిల్లాకు సంబంధించి ఐసీడీఎస్​లో 25 ప్రాజెక్టులు ఉండగా... అంగన్​వాడీ కేంద్రాలు 4,952 ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో గర్భిణులు 28వేలు, బాలింతలు 26వేలు, ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు 1.6 లక్షల మంది, మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 70వేలు ఉన్నారు. విశాఖ నగర పరిధిలో సుమారు వెయ్యికి పైగా కేంద్రాల్లో 15 వేల మంది పిల్లలు, 28 వేల మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు.

  • కొత్త మెనూలో ఏమున్నాయంటే...

కొత్త మెనూ ప్రకారం.... ఆరేళ్లలోపు ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు నెలకు రెండు కిలోల బియ్యం, అర కిలో కందిపప్పు , 150 గ్రాముల నూనె, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు చొప్పున ఇవ్వనున్నారు. గర్భిణులు, బాలింతలకు సంబంధించి మూడు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, అరకిలో నూనె, ఐదు లీటర్ల పాలు, 25 గుడ్లు, రాగి పిండి, అటుకులు బెల్లం, వేరుశనగ తదితర సరుకులు ఇవ్వనున్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో చిన్నారులు, తల్లులకు వైఎస్సార్ సంపూర్ణ పథకం ప్రయోజనం విధివిధానాలను ఐసీడీఎస్ అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించి ప్రీ ప్రైమరీ పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి గృహ సందర్శన పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సంసిద్ధులను చేస్తున్నారు. కొత్త మెనూ అందరూ సద్వినియోగం చేసుకొని అంగన్​వాడీ నిర్వహణను మరింత బలోపేతం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి

ABOUT THE AUTHOR

...view details