ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక న్యాయం వైకాపాతోనే సాధ్యం: మంత్రులు - రెండోరోజు మంత్రుల బస్సు యాత్ర

YSRCP Ministers Bus Yatra: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా... వైకాపానే గెలిపించాలని సామాజిక న్యాయభేరి పేరిట నిర్వహిస్తున్న బస్సు యాత్ర ద్వారా మంత్రులు కోరారు. విశాఖ పాత గాజువాక జంక్షన్‌ నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభించిన అమాత్యులు.. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాతే సామాజిక న్యాయం అమలవుతోందన్నారు. అయితే తొలిరోజు వర్షం కారణంగా నిలిచిపోయిన మంత్రుల బహిరంగ సభ.. రెండో రోజు రాజమహేంద్రవరంలో జనం లేక వెలవెలబోయింది.

ycp bus yatra
ycp bus yatra
author img

By

Published : May 27, 2022, 9:19 PM IST

Updated : May 28, 2022, 5:16 AM IST

రెండోరోజు బస్సు యాత్ర.. జగన్ అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం అమలవుతోందన్న మంత్రులు

'అన్ని రంగాల్లో.. అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఉన్నప్పుడే సామాజిక న్యాయం చేకూరుతుంది. అది వైకాపా ప్రభుత్వంతోనే సాధ్యం. సంక్షేమ పథకాల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు గౌరవంగా అందుకునేలా సీఎం జగన్‌ బాటలు వేశారు' అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శుక్రవారం వైకాపా నిర్వహించిన "సామాజిక న్యాయభేరి యాత్ర" గాజువాక, అనకాపల్లి, తుని, అన్నవరం, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో పలువురు మంత్రులు మాట్లాడారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ జగన్‌కు అమృతం దొరికితే అన్ని సామాజిక వర్గాలకు సమానంగా పంచి పెడతారనీ... అదే చంద్రబాబుకు దొరికితే ఎవరికీ తెలియకుండా వారి బంధువులకు పంచుతారని ధ్వజమెత్తారు.

హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వెనకబడిన వర్గాల రాజకీయ సాధికారత కోసమే 17 మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కట్టబెట్టారన్నారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎంతో ముందుగా వచ్చిన మహిళలు తాము రావడం ఆలస్యం కావడంతో వెళ్లిపోయారనీ.. వారంతా టీవీల్లో చూస్తూనే ఉంటారని పేర్కొన్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రసంగిస్తూ.. 'చంద్రబాబు చేస్తున్నది మహానాడు కాదు... మాయనాడు..' అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందిన 80శాతం మందికి నవరత్నాలు అందాయని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ ఎన్నికల తరుణంలో మూడు నెలల ముందు చంద్రబాబు మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ప్రసంగిస్తూ జగన్‌ కుల, మత, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన నేత జగన్‌ అని కొనియాడారు.

మంత్రులు వచ్చేలోగానే కుర్చీలన్నీ ఖాళీ: రాజమహేంద్రవరం బహిరంగ సభకు భారీగా ప్రజలను సమీకరించారు. డ్వాక్రా మహిళలను, ఉపాధి హామీ కూలీలను బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో సభా స్థలానికి తరలించారు. అయితే... సభ మొదలయ్యే సమయానికి 2 వేల మంది కూడా లేరు. మంత్రులు సభాస్థలికి రాక ముందే కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. సభ సాయంత్రం నాలుగు గంటలకే మొదలవ్వాల్సి ఉండగా జనాన్ని మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణానికి తెచ్చారు. అప్పటి నుంచి తమకు కనీసం అల్పాహారం కూడా ఇవ్వలేదని కొందరు వాపోయారు. సాయంత్రం 6 గంటల నుంచి జనం వెనుదిరిగారు. పోలీసులు గేట్లు మూసి ఆపేయడంతో వారు వాగ్వాదానికి దిగారు. 'ఎప్పుడో మధ్యాహ్నం రెండు గంటలకు తెచ్చారు. ఇంకెంతసేపు ఉంచుతారని' అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. రాత్రి 7.30 గంటలకు సభ మొదలు కావటంతో వచ్చిన వారిలో 20 శాతం మంది కూడా లేరు. దీంతో 17 మంది మంత్రుల్లో నలుగురు మాత్రమే మాట్లాడారు. 'మంత్రులు వచ్చేస్తున్నారు కొద్దిసేపు ఉండండి' అని మంత్రి వేణుగోపాలకృష్ణ చెబుతున్నా వచ్చిన జనం పట్టించుకోకుండా వెళ్లిపోతూనే ఉన్నారు.

ఆంక్షల గుప్పిట్లో గాజువాక: యాత్ర సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడం, దుకాణాలను మూసివేయించడంతో వాణిజ్య కేంద్రమైన గాజువాక నిర్మానుష్యమైంది. తెల్లవారుజాము నుంచి సభ ముగిసే వరకూ ఈ ఆంక్షలు అమలు చేయడం గమనార్హం. గాజువాకతో పాటు, ఎన్‌ఏడీ కూడలిలో ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ స్తంభించడంతో ఇటు సింధియా మీదుగా నగరంలోకి వెళ్లాల్సిన ప్రయాణికులు, అటు కూర్మన్నపాలెం నుంచి అనకాపల్లి, రాజమహేంద్రవరం వెళ్లే ప్రయాణికులు దాదాపు మూడు, నాలుగు గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తితిదే ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి ఎన్‌ఏడీకూడలి పైవంతెన వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అనంతరం వాహనాలను క్రమబద్ధీకరించడంతో సభాస్థలికి చేరుకున్నారు.

ఇదీ చదవండి:మహానాడుకు బైక్ ర్యాలీ.. తగ్గేదేలే అంటున్న తెలుగు మహిళలు

Last Updated : May 28, 2022, 5:16 AM IST

ABOUT THE AUTHOR

...view details