విశాఖ పట్నంలోని గంగవరం నౌకాశ్రయంలోని ప్రభుత్వ వాటాను విక్రయించాలని నిర్ణయించడం అవివేకమైన చర్యగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తాజా పరిణామాలపై వివిధ అంశాలను అందులో పేర్కొన్నారు.
GANGAVARAM: 'గంగవరం నౌకాశ్రయం వాటా విక్రయం అవివేకమే' - గంగవరం నౌకాశ్రయంలోని ప్రభుత్వ వాటా విక్రయం
గంగవరం నౌకాశ్రయంలోని ప్రభుత్వ వాటాను విక్రయించాలని జగన్ సర్కార్ నిర్ణయించడాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ తప్పుబట్టారు. ఇది వివేకవంతమైన చర్య కాదని అని అన్నారు.
'ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో అదానీ పోర్టులు గుత్తాధిపత్యాన్ని చెలాయించడానికి రాష్ట్రం సహకరిస్తున్నట్లు అయింది. పోర్టులోని ఇతర వాటాదారులు తమ వాటాలను ఏ ప్రాతిపదికన విక్రయించారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం తన వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించి, అత్యధిక మొత్తాన్ని ఎవరు చెల్లిస్తే వారికి అమ్మితే భారీ ఎత్తున లబ్ధి చేకూరేది. అంతర్జాతీయ బిడ్డింగుకు వెళ్లినా మంచి ధర లభించేది. విశాఖ ఉక్కును విక్రయించబోతున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలోనే అదానీ కంపెనీ గంగవరం నౌకాశ్రయంలోని వాటాను కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా కేంద్రంతో కుమ్మక్కై విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలుకు అదానీకి మార్గం సుగమం చేస్తున్నట్లు అనిపిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు ఎస్.బి.ఐ.క్యాప్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే హెచ్చరించింది. 'ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టం-2001' ప్రకారం ఎలాంటి ఆస్తులకైనా చట్టబద్ధంగా, పారదర్శంగా విలువ కట్టాలి. గంగవరం నౌకాశ్రయంలో వాటా విక్రయిస్తున్న తీరును పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించాల్సి వస్తోంది. గతంలో ప్రభుత్వం అతితక్కువ ధరకే గంగవరం నౌకాశ్రయానికి భూములను విక్రయించింది. 1086 ఎకరాలను అతితక్కువ అద్దెకు లీజుకు ఇచ్చింది. లీజు మొత్తం నిర్ణయం, అద్దె పెంపు తదితర అంశాల్లోనూ నిబంధనల ఉల్లంఘన జరిగింది. తక్కువ లీజు నిర్ణయించడంతో రహస్యంగా చాలా రాయితీ ఇచ్చినట్లైంది' అని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి:ఆదాయం వస్తున్నా గంగవరం పోర్టును అమ్మాల్సిన అవసరం ఏంటి ?: తేదేపా