విశాఖలో ప్రోటోకాల్ వివాదం.. తెదేపా, వైకాపా నేతల తోపులాట - velagapudi ramakrishna babu
విశాఖలో ఎంవీపీ కాలనీ సెక్టార్-7లో హుద్‌హుద్ తుపాను ఇళ్ల ప్రారంభోత్సవం వేడుక రసాభాసగా మారింది. వైకాపా, తెదేపా నేతల మధ్య తోపులాట జరిగింది.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో హుద్ హుద్ తుపాను బాధితుల కోసం ఎంవీపీ కాలనీలో నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఇళ్ల ప్రారంభానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావులతో సహా వైకాపా నేతలంతా హాజరయ్యారు. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్న తెలుగుదేశం నేత వెలగపూడి రామకృష్ణబాబుకు అహ్వానం అందలేదు. ఎక్కడా పేరు కూడా లేకుండా వ్యవహరించటంతో తెదేపా కార్యకర్తలు అందోళనకు దిగారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యక్రమం బయటే వేచి ఉన్నారు. ప్రతిగా వైకాపా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈలోగా వివాదం ముదిరి ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. తెదేపా కార్యకర్తల నిరసనల మధ్యనే మంత్రి అవంతి ఇళ్లను ప్రారంభించారు.