మహిళా సాధికారతపై విద్యార్థినులతో వాసిరెడ్డి పద్మ ముఖాముకి - దిశ చట్టం అమలు పై కేంద్రానికి సమగ్ర వివరణ ఇచ్చాం: వాసిరెడ్డి పద్మ
దిశ చట్టం అమలుపై కేంద్రానికి సమగ్ర వివరణ ఇచ్చామని.. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. విశాఖలో ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో మహిళా సాధికారతపై విద్యార్థినులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రానికి, దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలని దిశ చట్టం రూపొందించామని.. మహిళలపై నేరాలకు పాల్పడే వాళ్లు శిక్షల నుంచి తప్పించుకుంటూ చట్టానికి న్యాయానికి సవాలుగా మారారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖలో ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో మహిళా సాధికారతపై విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. దిశ చట్టం అమలుకు కృషి చేస్తున్న సీఎం జగన్ను మహిళా లోకం అభినందిస్తుందని అన్నారు. ఈ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని పేర్కొన్నారు. దిశ చట్టంపై మగవారికి కూడా అవగాహన అవసరమని.. దిశ చట్టం అమలుపై కేంద్రం అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరణ ఇచ్చిందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, విద్యార్థినులు పాల్గొన్నారు.