ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2020, 12:46 PM IST

ETV Bharat / state

జ్వరం.. దగ్గు.. జలుబు ఉన్నాయా!

కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకూ ప్రభావం మరింత పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో విశాఖలోని కంటైన్‌మెంట్‌ జోన్‌లలోని అనుమానం ఉన్న వారందరికీ.. అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tests for those with corona symptoms at visakha district
Tests for those with corona symptoms at visakha district

కరోనా నిఘా మరింతగా పెరుగుతోంది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ‘కొవిడ్‌-19’ అనుమానిత లక్షణాలు ఎవరికున్నా.. నమూనాలు సేకరించేందుకు విశాఖ జీవీఎంసీ, ఆరోగ్యశాఖల అధికారులు పక్కా వ్యూహాన్ని అమలు పరుస్తున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో పాజిటివ్‌ రోగుల నివాసాలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని ఇళ్లనూ అధికార యంత్రాంగం, సిబ్బంది జల్లెడ పడుతున్నారు. జ్వరం, పొడిదగ్గు, జలుబు, గొంతునొప్పి, శ్వాస ఇబ్బందులు.. ఇలా ‘కొవిడ్‌-19’ లక్షణాల్లో ఏది కనిపించినా.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఎలా చేస్తున్నారంటే..:

  • నగరవ్యాప్తంగా తీసుకునే నమూనాల్లో కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచే 80 శాతం ఉండేలా చూస్తున్నారు.
  • ప్రత్యేకించి మొబైల్‌ నమూనా సేకరణ బృందాల్ని ఏర్పాటు చేశారు. ఈఎన్‌టీ ఆసుపత్రి నుంచి ఒక్కో బృందంలో ఒక్కో వైద్యుడు ఉండటంతో పాటు అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
  • ఒక్కో మొబైల్‌ నమూనా సేకరణ బృందానికి రెండేసి కంటైన్‌మెంట్‌ జోన్లు అప్పగించారు. అనుమానిత లక్షణాలున్న ప్రాంతాలకు వెళ్లడం, ఆయా వ్యక్తుల్ని తెచ్చి అంబులెన్స్‌లోనే పరీక్షలు నిర్వహించి నమూనాలు తీసుకోవడం చేస్తున్నారు.
  • వ్యక్తుల వివరాల్ని రికార్డు చేస్తున్నారు.
  • మరోవైపు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు (ఆర్‌ఆర్‌టీ) వెళ్తున్నాయి.

రెడ్‌జోన్లలో మొబైల్‌ దుకాణాలు

కంటైన్‌మెంట్‌ జోన్‌లో అనుమానాలున్న అందరికీ పరీక్షలు చేస్తామని జీవీఎంసీ కమిషనర్​ డాక్టర్ జి. సృజన తెలిపారు. నిత్యావసరాలు, కూరగాయల సరఫరాకు మొబైల్‌ దుకాణాల్ని వినియోగించాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. సంయుక్త కలెక్టరుతో చర్చిస్తున్నామన్నారు. శుక్రవారం 2 మొబైల్‌ వాహనాల్ని ప్రారంభించామని.. వీటిని ఇంకా పెంచుతామని చెప్పారు. నిత్యావసరాల డోర్‌ డెలివరీలో చాలా సమస్యలున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయని.. మరోసారి సమాలోచనలు చేసి ఇబ్బందుల్లేకుండా చేస్తామని తెలిపారు.

ఎవరెవరు పరీక్షలు చేయించుకోవాలి?

పాజిటివ్‌ రోగితో సన్నిహితంగా ఉన్నవారూ.. కంటైన్‌మెంట్‌ జోన్లలో ‘కొవిడ్‌-19’ లక్షణాలు ఉన్నవారు తప్పని సరిగా పరీక్షలు చేయించుకోవాలి.

ఇదీ చదవండి:

శుభ్రత పాటించండి.. పండంటి బిడ్డకు జన్మనివ్వండి

ABOUT THE AUTHOR

...view details