TENSION AT VISAKHA AIRPORT : విశాఖ విమానాశ్రయం వద్ద కొద్దిసేపు అలజడి చోటుచేసుకుంది. విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన జనసమూహం మంత్రుల కార్లపై దాడికి దిగింది. మంత్రులు రోజా, జోగి రమేశ్ వాహనాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆ వెనకే వస్తున్న వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కారుపైనా దాడి చేశారు. ఈ ఊహించని దాడితో మంత్రులు కొంత కంగారుపడ్డారు.
మంత్రులపై ఆగ్రహించిన జనసైనికులు : విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు వైకాపా నేతలు విమానాశ్రయానికి చేరుకోగా.. అప్పుడే విశాఖ వస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో జనసేన శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. విశాఖ గర్జనలో పవన్‌కల్యాణ్ లక్ష్యంగా మంత్రులు విమర్శలు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనసేన కార్యకర్తలు.. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడ ఉన్న గుంపులో నుంచి కొందరు వ్యక్తులు వైకాపా నేతల కార్లవైపు దూసుకొచ్చారు. మంత్రుల కార్ల బ్యానెట్లపై చేతులతో బాదారు.