గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న ముడిసరకు, ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతించాలంటూ సంస్థ యాజమాన్యం హైకోర్టును అభ్యర్థించింది. వాటిని అమ్ముకోవడానికి తమకు అభ్యంతరం లేదన్న ప్రభుత్వ న్యాయవాది... వాటిలో కాలం చెల్లినవాటిని, ప్రమాదకరమైనవాటి విషయంలో ఎలా వ్యవహరిస్తారో తెలపాలన్నారు. కాంపిటెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉత్పత్తుల విక్రయ ప్రక్రియను పర్యవేక్షణకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును కోరారు. సరకు విక్రయాల నుంచి వచ్చిన సొమ్మును బాధితులకు పరిహారంగా చెల్లించే నిమిత్తం జిల్లా కలెక్టర్ వద్ద జమచేయాలని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏ అథారిటీ పర్యవేక్షణతో విక్రయం నిర్వహిస్తే బాగుంటుందో తెలపాలని ఇరువురికీ సూచన చేసింది. విచారణను ఈనెల 6 కు వాయిదా వేసింది.
గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం పెంపు, వైద్య సదుపాయాల కల్పన, ఘటనపై సీబీఐతో దర్యాప్తు తదితర అభ్యర్థనలో దాఖలైన వ్యాజ్యాలు తాజాగా హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఎల్జీ పాలిమర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గ్యాస్ లీక్ తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో కంపెనీ సీజ్ చేశారన్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉందని. . కంపెనీలో విలువైన ముడిసరుకు , పాక్షిక , పూర్తిస్థాయిలో ఉత్పత్తి అయిన సరుకు ఉందని ధర్మాసనానికి తెలిపారు. ముడి సరుకు రోజుల తరబడి పరిశ్రమలో ఉంటే ప్రమాదమని, ఉత్పత్తులతో పాటు ముడి సరుకును విక్రయించేందుకు అనుమతించాలని హైకోర్టును కోరారు. ఎంతకు విక్రయించాం, ఎవరికి విక్రయించాం, వాటి ద్వారా వచ్చిన ఆదాయ వివరాలతో అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పిస్తామన్నారు.