ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఆంగ్లంలో బోధన ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. సుమారు 11 నెలల తరువాత వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పేరుతో తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ప్రీ ప్రైమరీలో ఆట, పాటలతో బోధనంతా తెలుగులో సాగేది. ఇకపై ఆంగ్లంలో జరగనున్నది. ఇందుకోసం జిల్లాలోని 25 ప్రాజెక్టుల పరిధిలో గల 4,952 కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఈ నెల 18 నుంచి 22 వరకు శిక్షణ ఇచ్చారు.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రీ ప్రైమరీ తరగతులు జరగనున్నాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ-1, నాలుగేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య చిన్నారులకు ప్రీ ప్రైమరీ-2గా విభజించి బోధన చేయనున్నారు. జిల్లాలో ఈ తరగతులకు హాజరయ్యే 3-6 ఏళ్ల మధ్య చిన్నారులు 60,810 మంది ఉండగా, వీరిలో 30,420 మంది బాలురు, 30,390 మంది బాలికలు.
అంతా ఆంగ్లంలోనే...
అంగన్వాడీ కేంద్రాలను ఎప్పటినుంచో ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా నిర్వహిస్తున్నారు. అయితే బోధన తెలుగులో సాగింది. వచ్చే నెల ఒకటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టనున్నారు. శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు బోధనపై మరింతగా పట్టు సాధించేందుకు అవసరమైన వీడియోలను అందించారు. తరగతికి చిన్నారి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జరిగే సంభాషణలన్నీ ఆంగ్లంలోనే జరగనున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు అంగన్వాడీ కార్యకర్తలకు 17 రకాల కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చారు. గతంలో ఆయా కార్యక్రమాల కోసం అవసరమైన వస్తువులను అందిస్తే... ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మెటీరియల్ ఉన్నతాధికారులు అందించారు.
అక్కడే పిల్లలకు భోజనం...
కొవిడ్ వల్ల ఇప్పటివరకు గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తున్నారు. అయితే, ఒకటో తేదీ నుంచి ప్రీ ప్రైమరీ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రం కేంద్రం వద్దే భోజనం పెట్టనున్నారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం గుడ్డు, పప్పు, పాలతో కూడిన పోషకాహారాన్ని అందించనున్నారు. గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులకు మాత్రం గతంలో మాదిరిగానే ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తారు.
ఇదీ చదవండి: