విశాఖ జిల్లా వ్యాప్తంగా 3035 ఖాళీల గానూ సుమారు 5000 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేశారు. బదిలీల దరఖాస్తు గడువు ఈనెల 16తో ముగిసింది జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 10,307 ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ నిబంధనల మేరకు ఒకేచోట ఐదు నుంచి ఎనిమిది ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా అక్కడినుంచి బదిలీ చేస్తారు. ఈ కోవ కిందకు వచ్చే సుమారు 13 వందల 85 మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అలాగే కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మరో 3638 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఎక్కువగా పట్టణ కేంద్రాల్లో, ప్రధాన రహదారికి సమీపంలో గల పాఠశాలలకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే విశాఖ నగర పరిధిలో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు. నగరం చుట్టుపక్కల పాఠశాలల్లోనే.. ఉంటామని అడుగుతున్నారు. కాగా దీనిపై పాఠశాల విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించింది. జీవీఎంసీ పరిధిలో తక్కువగా ఖాళీలు ఉన్నందున సర్వీస్ పాయింట్ల వారీగా పోస్టింగ్స్ లభిస్తాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు రెండు రోజుల నుంచి పరిశీలిస్తున్నారు. నిబంధనలకు లోబడి దరఖాస్తు చేశారా! లేదా అనే చూసిన తర్వాత దరఖాస్తును తిరిగి అప్లోడ్ చేస్తారు .