TDP Porubata: విశాఖలో తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణగదొక్కారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు . రుషికొండ పరిసరాల్లోకి ఏ ఒక్కరినీ అనుమంతించలేదు, ఉత్తరాంధ్ర సమస్యలపై తెలుగుదేశం పోరుబాటలో భాగంగా..రుషికొండకు ఆ పార్టీ నేతలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. విశాఖలోని తెదేపా కార్యాలయంతోపాటు ఆపార్టీ నేతల ఇళ్ల వద్ద నిఘా పెంచారు. నేతలు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ రామారావు, తెదేపా నేత పల్లా శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగుదేశం నాయకుడు బండారు అప్పలనాయుడును పోలీసులు స్టేషన్ కు తరలించారు. మేనత్త ఆస్పత్రిలో ఉందని చెప్పినా వినకుండా తీసుకెళ్లారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితను పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖలోకి వచ్చే అన్ని రహదారుల్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. భీమిలి నుంచి విశాఖకు వచ్చేవారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తెదేపా నేతలు విశాఖ తరలిరాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కళ వెంకటరావును గృహ నిర్బంధం చేశారు. ఉదయం 5గంటల నుంచే రాజాంలో అయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కళా వెంకట్రావు ఇంటి వద్దకు చేరుకున్న తెదేపా నాయకులు... పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. విశాఖ వస్తున్న తెదేపా నేత కూన రవికుమార్‌ను భీమిలిలో అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. సొంత పనులుపై వెళ్తున్న కార్యకర్తలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. సాలూరులో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంద్యారాణిని పోలీసులు నిర్బంధించారు.