ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిషిద్ధ జాబితాలో ఉండగానే దసపల్లా భూముల్లో పనులు.. చోద్యం చూస్తున్న అధికారులు - దసపల్లా భూముల్లో పనులు

Dasapalla Lands: విశాఖలోని దసపల్లా భూములు ప్రభుత్వానివని చెబుతూ 2015 నుంచి 22(ఎ)లో పెట్టి, జిల్లా యంత్రాంగం వాటిని కాపాడుకుంటూ వస్తుంటే.. ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వ్యక్తులకు వాటిని కట్టబెట్టేందుకు జిల్లా అధికారులు తాపత్రయపడుతున్నారు.

Dasapalla Lands
Dasapalla Lands

By

Published : Jan 10, 2023, 8:30 PM IST

Updated : Jan 11, 2023, 6:57 AM IST

Dasapalla Lands: పేదలు ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసె వేసుకుంటేనే అధికారులు ఆగమేఘాల మీద వచ్చి పీకి పారేస్తారు. ప్రతిపక్ష నాయకులపై ప్రదర్శించే దూకుడు గురించి ఇక చెప్పక్కర్లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారనో, నిర్మాణ ప్లాన్‌ను ఉల్లంఘించారనో సాకు చూపించి.. రాత్రికి రాత్రే భవనాల్ని కొట్టేస్తారు. అదే అధికార పార్టీ నాయకుల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయంటే జీ హుజూర్‌ అంటారు.

విశాఖలోని దసపల్లా భూములు ప్రభుత్వానివని చెబుతూ 2015 నుంచి 22(ఎ)లో పెట్టి, జిల్లా యంత్రాంగం వాటిని కాపాడుకుంటూ వస్తుంటే.. ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వ్యక్తులకు వాటిని కట్టబెట్టేందుకు జిల్లా అధికారులు తాపత్రయపడుతున్నారు. విశాఖ నడిబొడ్డున ఉన్న సుమారు రూ.2వేల కోట్ల విలువైన, వివాదాస్పద దసపల్లా భూముల్లోకి మంగళవారం కొందరు వ్యక్తులు పొక్లెయిన్‌తో వచ్చి పిచ్చిమొక్కలు, పొదలు తొలగించడం, గుట్టల్ని చదును చేయడం, చుట్టూ ఫెన్సింగ్‌ వేసి ఆ భూమి బయటివారికి కనపడకుండా రేకులు అమర్చడం వంటి పనులు చేస్తున్నా రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు అటువైపు తొంగిచూడలేదు.

ప్రభుత్వం నిషిద్ధ జాబితాలో ఉంచిన ఆ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు పనులు ఎలా చేపట్టారు? ఆ భూముల్ని 22(ఎ) నుంచి తొలగించకుండానే అక్కడ పనులు చేయడానికి జిల్లా యంత్రాంగం ఎలా అనుమతిచ్చింది? అనుమతి లేకుండానే పనులు మొదలుపెడితే... అధికారులు ఎందుకు అడ్డుకోలేదు? దసపల్లా భూముల యజమానులుగా చెబుతున్నవారితో అధికారులు ఎంతగా కుమ్మక్కయ్యారో చెప్పడానికి ఇది నిదర్శనం కాదా?

పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన

2015 నుంచి 22(ఎ)లో ఉంచి కాపాడుతున్న దసపల్లా భూముల్ని ఇటీవల హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు జిల్లా కలెక్టర్‌ అంతా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఆ భూములపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం... నేడో రేపో 22(ఎ) నుంచి తొలగించబోతున్నట్టు తెలిసింది. కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకైనా ఆగకుండానే.. వివాదాస్పద భూముల్లో పనులు మొదలుపెట్టేయడం కలకలం సృష్టించింది.

దసపల్లా భూములు ఉన్నది కొండప్రాంతం కావడంతో.. పేలిస్తే రాళ్లు ఎగిరిపడి తమకు ఇబ్బంది కలుగుతుందని చుట్టుపక్కల భవనాల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దసపల్లా భూముల్లో ప్రస్తుతానికి ముళ్లపొదలు, పిచ్చి మొక్కలనే తొలగిస్తున్నామని అక్కడ పనుల్ని పర్యవేక్షిస్తున్న వారు చెబుతున్నారు. భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టేటప్పుడు చుట్టుపక్కల ఉన్నవారికి ఇబ్బంది కలగకూడదనే ముందుగా ఫెన్సింగ్‌ వేస్తున్నామని తెలిపారు.

తవ్వకాలపై తెదేపా నాయకుల నిరసన

దసపల్లా భూముల్లో ప్రైవేటు వ్యక్తులు భారీ యంత్రాలతో తవ్వకాలకు పాల్పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదని తెదేపా నాయకులు మండిపడ్డారు. వర్కు ఆర్డరు, అనుమతులు లేకుండా దసపల్లా కొండప్రాంతాన్ని ఎలా చదును చేస్తారని పొక్లెయిన్‌ సిబ్బందిని మంగళవారం నిలదీశారు. తెదేపా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడుగు కుమార్‌, ఇతర నాయకులు పనులను అడ్డుకున్నారు.

ఖరీదైన ప్రభుత్వ భూములను రక్షించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. కొండ దిగువనే తెదేపా కార్యాలయం ఉందని, కొండను పగలగొట్టినా, చదును చేసినా రాళ్లు దొర్లి కార్యాలయంపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపి వెనుదిరిగారు. వీరు వెళ్లాక పనులు కొనసాగాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details