ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దొంగ డిగ్రీలు చదివిన మీరా.. దొంగ సర్టిఫికెట్ల గురించి మాట్లాడేది? - అయ్యన్నపాత్రుడు

By

Published : Feb 11, 2022, 7:13 PM IST

తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు అరెస్ట్​పై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. అశోక్ బాబును బేషరతుగా విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

14439140
14439140

దొంగ డిగ్రీలు చదివిన జగన్ రెడ్డి.. దొంగ సర్టిఫికెట్ల గురించి మాట్లాడుతున్నారంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఏ తప్పూ చేయని అశోక్ బాబు గురించి మాట్లాడే ముందు.. జగన్ తన వెనుక చూసుకోవాలని హితవు పలికారు. కావాల్సిన చోట ఎంబీఏ అని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అఫిడవిట్ లో బీ.కామ్ అని పెట్టిన మీ చరిత్ర మర్చిపోయారా? అని నిలదీశారు. జగన్ విద్యార్హతకు సంబంధించిన పత్రాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

కక్షసాధింపులకే పరిమితం -సోమిరెడ్డి
అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఈ రోజుకీ ప్రజాపాలనపై దృష్టిపెట్టకుండా కక్షసాధింపులకే జగన్ రెడ్డి పరిమితమయ్యారని మరో నేత సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్జ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ కుట్రలపై ధ్వజమెత్తినందుకే అశోక్ బాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ అరెస్టులు ఎల్లకాలం కొనసాగించలేరన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

అశోక్ బాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో పటమట పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా శ్రేణుల నిరసన తెలిపాయి. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా అంటూ నినాదాలు చేశారు. అశోక్ బాబును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అశోక్ బాబు అరెస్ట్.. ఎందుకంటే..?
TDP MLC Ashok babu arrest: తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని నివాసం నుంచి రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన్ను తరలించారు. గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే అక్కడ మఫ్టీలో మాటు వేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, వాహనంలో తరలించారు. అశోక్‌బాబును అరెస్టు చేసినట్లు, కోర్టులో హాజరపరచనున్నట్లు సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరు వాసి మాదాల గోపికి నోటీసు అందించారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా, చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాన్ని సమర్పించారనీ, మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్‌కుమార్‌.. లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన లోకాయుక్త.. వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ డి.గీతామాధురి ఇటీవల అశోక్‌బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి

అశోక్‌బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details