Palla Srinivasa Rao : : విశాఖ నగర పరిధి కూర్మన్నపాలెంలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లేఅవుట్‌లో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నాయని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ‘కూర్మన్నపాలెంలో సైమన్ అనే వ్యక్తికి 25 ఎకరాల భూములను గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఆయా భూముల్లో సైమన్ తన బంధువు డి.పాల్‌కు 6.80 ఎకరాలు, కుమార్తె షీలా మార్గెట్‌కు 3.20 ఎకరాలు, ఇతర కుటుంబ సభ్యులకు 15 ఎకరాలు కేటాయించారు. పాల్ తనకు కేటాయించిన భూమిలో లేఅవుట్ వేశారు. అందులో డీఎల్‌బీ (డాక్ లేబర్ యార్డు) ఉద్యోగులు 167 మంది స్థలాలు కొనుగోలు చేశారు. షీలా మార్గెట్‌కు చెందిన స్థలం ఖాళీగా ఉంది. పాల్ లేఅవుట్‌కు 2000లో వుడా అధికారులు ఎల్‌పీ (ల్యాండ్ పొజిషన్) ధ్రువపత్రం జారీ చేశారు.
పాల్ దగ్గర స్థలాలు కొనుగోలు చేసిన వ్యక్తులు, షీలా మార్గెట్ గానీ విశాఖ ఎంపీ ఎంవీవీకి భూములు రిజిస్ట్రేషన్ చేయలేదు. 15 ఎకరాలకు అనుభవదారులుగా సైమన్ ఇతర కుటుంబ సభ్యులతో ఎంపీ రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. లేఅవుట్‌లో 1200 చదరపు గజాల పార్కు స్థలం ఉంది. మరో 30 సెంట్లలో శ్మశాన వాటిక స్థలం, దాన్ని ఆనుకొని 30 అడుగుల రోడ్డు ఉంది. ఇందులోనే పోలవరం కాలువకు నాలుగు ఎకరాల భూములను లోగడ కేటాయించారు. వీటన్నింటిని కలిపి ఎంపీ ఎంవీవీ నిర్మాణాలు చేపట్టారు...’ అని పల్లా శ్రీనివాసరావు వివరించారు.