రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు జాతీయ బ్యాంకులలో ఉన్న ఖాతాలను స్దానిక సహకార బ్యాంకులలోకి మార్చి వాటిని హామీగా చూపి పెద్ద ఎత్తున రుణం తీసుకోవడానికి జగన్ రెడ్డి యత్నిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆసరా పేరు మీద మహిళలను మోసం చేస్తున్న జగన్ రెడ్డి తీరును ఎండగడుతూ ఆయన వీడియోను విడుదల చేశారు. ఇది ఆసరా కాదని, మహిళలకు టోకరాగా అభివర్ణించారు.
రాష్ట్రంలో 98 లక్షల మంది ద్వాక్రా మహిళలు ఉంటే, ఆసరా మొదటి విడతగా 87 లక్షల మందికి ఇచ్చారని, ఇప్పుడు ఆసరా రెండో విడతలో కేవలం 76 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. మిగిలిన 11 లక్షల మంది మహిళలకు ఆసరా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆసరాకు ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి కాదని, ఎందుకంటే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని, ఇవి కార్పొరేషన్ల నుంచి తీసుకున్నవేనన్నారు.