అనుమతులు లేవంటూవిశాఖ నడిబొడ్డున సీతంపేటలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భవనాన్నిమున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. నగరంలో దాదాపు పదివేల అక్రమ కట్టడాలు గుర్తించామన్న అధికారులు... మిగతా వాటిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయడంతో అక్రమ భవనాలు కట్టిన యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మొదటి విడతగా కొన్ని భవనాలను కూల్చిన అధికారులు.. రెండో విడతలో భాగంగా పక్కా ఆధారాలతో అక్రమ భవనాలకు నోటీసులు అంటిస్తూ కూల్చివేస్తున్నారు. గతంలోనే నోటీసులు జారీ చేసిన భవన యజమానుల నుంచి సరైన సమాధానం రాకపోవటంతో కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు.
స్పందించిన పీలా గోవింద సత్యనారాయణ
తన భవనం కూల్చివేయటంపై పీలా గోవింద్ స్పందించారు. సీతంపేట ప్రధాన రహదారిపై ఉన్న భవనం కోసం అనుమతులకు ఇప్పటికే దరఖాస్తు చేశానని తెలిపారు. ఈవిషయంలో జీవీఎంసీ అధికారులకు లిఖిత పూర్వకంగా అర్జీ పెట్టుకున్నట్టు వెల్లడించారు. హఠాత్తుగా భవనాన్ని కూల్చివేయటం కేవలం కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు నోటీసు అంటించారని.. అందులో కేవలం 24 గంటల్లోనే భవనాన్ని తొలగించాలని సూచించారని చెప్పారు. వారం రోజులుగా తాను కుటుంబంతో కలిసి యాత్రలకు వెళ్లానని వివరించారు.