EX minister Ganta sensational comments on the YSRCP govt: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై తెలుగుదేశం పార్టీ నేతలు.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ చిరంజీవి రావు, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిందని.. అభివృద్ధిలో 1.5 శాతం కూడా వృద్ధి సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ మహానాడు కార్యక్రమం పోస్టర్ విడుదల..విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజమండ్రిలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్సీ చిరంజీవి రావు, విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''వివేకా హత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడంలో సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదు. గడిచిన నాలుగేళ్లలో విశాఖ రైల్వే జోన్ ఊసేలేదు. పోలవరం పురోగతిలో మార్పులేదు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులంతా ముఖ్యమంత్రిని కలిసి అడిగే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. అందులో ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని మొదటి డిమాండ్‌గా ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధం అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. నిన్నటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. మద్యపానం నిషేధం కాకపోగా, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతోంది. దీని కారణంగా అనేక మంది ప్రాణాలను కోల్పోయారు'' అని ఆయన అన్నారు.