chandrababu fire on Cm jagan : వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎస్సీల వేధింపులపై ప్రశ్నిస్తే.. వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ జోన్ 1 సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అందరికీ సమాన అవకాశాలు.. సమాన గౌరవం దక్కేలా తెలుగుదేశం పనిచేసిందని తెలిపారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
దళితులకు ఉన్నత అవకాశాలు టీడీపీ హయాంలోనే... బాబూ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితోనే మా పార్టీ పనిచేస్తోందని, దళిత మహిళను శాసనసభ స్పీకర్‌గా, బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన ఘనత మాదేనని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు రావాలని, సమాన గౌరవం దక్కాలని అన్నారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిని చంద్రబాబు సత్కరించారు. ఎమ్మెల్యేలను బానిస గా చూసిన జగన్.. ఎమ్మెల్సీ ఓటమితో ఎవ్వరినీ తీయ్యను అని ఎమ్మెల్యేలను బతిమాలుతున్నాడని అన్నారు. మోసం చేసేవారిని ఉత్తరాంధ్ర ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్న చంద్రబాబు.. ఒక్క దెబ్బకు దిగివచ్చి ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. విశాఖ తనకు ఎంతో ఇష్టమైన నగరం అని.. సుజల స్రవంతి పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. నాలుగేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని, భోగాపురం విమానాశ్రయంలో వీళ్లు ఒక్క ఇటుక వేయలేదని, పోలవరం ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.