ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కసింకోట ఘటన... మృతులకు స్పిరిట్ ఎలా దొరికింది? - విశాఖలో సర్జికల్ స్పిరిట్ ఘటన తాజా వార్తలు

ఔషధ కంపెనీల నుంచి రసాయన ద్రావణాలు బయటకు వస్తున్న తీరుపై ఆయా యంత్రాంగాలకు నియంత్రణ లేదని.. విశాఖలో సర్జికల్ స్పిరిట్ తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన నిరూపిస్తోంది. ఈ ఘటన తర్వాత అధికారులు ఇలాంటి వ్యవహారాలపై దృష్టి పెట్టినప్పటికీ.. తీరని ప్రాణ నష్టం జరిగిపోయింది. నియంత్రణ లేకుండా కొన్ని ఫార్మా కంపెనీల నుంచి సర్జికల్ స్పిరిట్​ తెచ్చి.. మద్యంలా వినియోగిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

surgical-spirit-issue-in-vizag-district
కసింకోట ఘటన... మృతులకు స్పిరిట్ ఎలా దొరికింది?

By

Published : Jun 7, 2020, 3:46 PM IST

మద్యం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విశాఖ జిల్లా కసింకోటలో సర్జికల్ స్పిరిట్ తాగి ఐదుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు విశాఖ కేజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు. కసింకోట గ్రామానికి చెందిన కునిశెట్టి ఆనంద్ లారీ డ్రైవర్​గా పని చేస్తూ.. ఒక ఫార్మా కంపెనీలో లోడింగ్ అన్ లోడింగ్ చేస్తుంటాడు. ఈ సమయంలోనే పరవాడ మండలంలోని ఒక ఔషధ కర్మాగారం నుంచి సర్జికల్ స్పిరిట్​ తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలా తీసుకొచ్చిన ద్రావణాన్ని గ్రామానికి చెందిన పలువురితో కలిసి తాగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 12 మంది స్పిరిట్ తాగినట్లు గుర్తించారు.

ఈ ఘటనలో ఆనంద్​తో పాటు వడిసెర్ల నూకరాజు, పెతకంశెట్టి అప్పారావు, వడ్లమూడి మాణిక్యం, పాంగి దొరబాబు మృతి చెందారు. మరో ఏడుగురు కేజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

అది మిథైలేనా!

ప్రభుత్వ మద్యం ధరలు విపరీతంగా పెంచటంతో.. గ్రామాల్లో చాలామంది నాటుసారా వైపు మరలుతున్నారు. మరికొంతమంది ఔషధ కంపెనీల్లో వాడే మిథైల్​ను మద్యంలా వినియోగిస్తున్నారు. కసింకోట ఘటనలోనూ మృతులు మిథైల్ తాగి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమని తాగాక 12 గంటల అనంతరం.. నాడీవ్యవస్థ, గుండెపై తీవ్ర ప్రభావం చూపి మృతి చెందుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి ప్రమాదకరమైన రసాయన ద్రావణాలు కంపెనీ నుంచి బయటికి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు నిఘా పెట్టాల్సి ఉంది. అసలు ఆ స్పిరిట్ బయటకు ఎలా వచ్చింది. కంపెనీ యాజమాన్యం ఏం చేస్తోంది అనే కోణాలు వెలుగు చూడాల్సి ఉంది. పరవాడలోని ఫార్మా కంపెనీలో సీసీ కెమెరాలు లేవని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని.. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

ఏదేమైనప్పటికీ ప్రమాదకర ద్రావణం తాగి ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇందులో ఎవరి తప్పన్నది అటుంచితే... ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి...అది 'మిథైల్ ఆల్కహాలే'

ABOUT THE AUTHOR

...view details