‘జీవితంలో ఏదీ సులువుగా దొరకదు. కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు అని నా అనుభవమే నాకు నేర్పింది. నేను పడ్డ కష్టాలకు ఒకానొక సమయంలో చనిపోవాలనీ అనుకున్నాను. క్షణికావేశంలో ఆరోజు ఆ నిర్ణయం తీసుకుంటే...ఈ రోజు నా గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగిలేది కాదు.’ అంటారు సుచిత్రారావు. జీవితంలో అడుగడుగునా సుడిగుండాలు చూసిన ఆమె ధైర్యంగా నిలబడడమే కాదు పదిమందికీ స్ఫూర్తినిస్తోంది. ఇప్పటివరకూ సుమారు వెయ్యిమందికిపైగా దివ్యాంగులు, మానసిక పరిణతలేని యువతకు ఉపాధినిచ్చింది. ఇదంతా సుచిత్ర ప్రారంభించిన ‘ప్రజ్వల్ వాణి’ సంస్థ ద్వారానే సాధ్యమైంది. తన జీవితంలో జరిగిన సంఘటనలను ఇలా వివరించారామె.
మాది విశాఖపట్నం. ఉన్నంతలో హాయిగా సాగిపోయేది మా కుటుంబం. నాకు పదిహేనేళ్లు వచ్చినప్పటి నుంచే తెలిసినవారంతా...నలుగురు ఆడపిల్లలు. వీరికి పెళ్లిళ్లెలా చేస్తారని ఆశ్చర్యపోయేవారు. ఈలోగా మా బంధువుల్లోనే ఓ సంబంధం వచ్చింది. ఇంట్లోవాళ్లు పెళ్లి చేశారు. అప్పటికి డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నా. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టా. కట్టుకున్నవాడు అప్పటికే మరో అమ్మాయికీ తన జీవితంలో స్థానం ఇచ్చాడని తెలిసి...షాకయ్యా. రోజులుగడుస్తున్నా. అతడి తీరులో మార్పు రాకపోవడంతో... గొడవపడ్డా. అది మొదలు దొరికిన ప్రతి అవకాశాన్నీ నన్ను వదిలించుకునేందుకు చూసేవాడు. అలా ఓసారి పుట్టింట్లో వదిలేసి స్థిరపడ్డాక వచ్చి నిన్ను తీసుకెళ్తా అన్నాడు. ఇక మరెప్పుడూ రాలేదు. మరోవైపు బంధువులు, చుట్టుపక్కల వారు...మాత్రం ఇంకెప్పుడు వెళ్తావ్ అత్తారింటికి అంటూ తరచూ ప్రశ్నించేవారు.
అలా నేర్చుకున్నా...
ఇలా ఎన్నాళ్లని ఇంట్లోనే ఉంటా...అందుకే నాన్నని ఒప్పించి చదువుకోవాలనుకున్నా. వోకేషనల్ డిగ్రీలో చేరా. కంప్యూటర్లు బాగుచేసే కోర్సు గురించి తెలుసుకోవడానికి జనశిక్షణ సంస్థాన్‌కి వెళ్లా. అక్కడ ‘ఈ పని నువ్వు నేర్చుకుంటావా’ అని ఆశ్చర్యపోయారు. అయినా మగవాళ్లే ఎందుకు నేర్చుకోవాలి? నేనూ చేయగలను అని చెప్పా. నా ఆసక్తిని గమనించిన వాళ్లు ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. నువ్వు ఆలోచించుకుని చెబితే...నేను అడ్మిషన్ ఇప్పిస్తా అన్నారు. అలా నేను హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టా. తోటి విద్యార్థులు ఆడపిల్లనని ఎగతాళి చేసేవారు అయినా పట్టుదలతో నేర్చుకున్నా. ఓ సారి ఓ నేవీ ఉద్యోగి కంప్యూటర్ బాగు చేస్తే 200 రూపాయలు ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన.