రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ సరఫరా చేసిన రాయితీ వరి విత్తనాలు విశాఖ జిల్లాలో మొలకెత్తలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని చీడికాడ మండలం జేబీపురం రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ రాయితీపై సరఫరా చేసిన ఆర్జెఎల్ వరి విత్తనాలు మొలకెత్తకపోవటంతో... రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జేబీపురం రైతు భరోసా కేంద్రం పరిధిలోని తునివలస, వింటిపాలెం గ్రామాలకు చెందిన రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు.
అయితే ఈ విత్తనాలు చాలా ప్రాంతాల్లో 50 నుంచి 30 శాతం మాత్రమే మొలకెత్తాయని... దాదాపుగా వందమంది రైతులు నష్టపోయారని తునివలస మాజీ సర్పంచ్ పేరపు కొండబాబు, పలువురు రైతులు చెబుతున్నారు. దీని గురించి "ఈటీవీ భారత్" చీడికాడ మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లగా... పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.