పరీక్షలు రద్దు చేశామని ఓ సారి.. పరీక్షలు నిర్వహిస్తామని మరోసారి వెంట వెంటనే ప్రకటనలు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలకు తాము సన్నద్ధం కావాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. డిగ్రీ 1, 2వ ఏడాది పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏయూ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఏయూ వైస్ ఛాన్సలర్ వచ్చి పరీక్షలు రద్దుపై ప్రకటన చేసే వరకు ఆందోళన విరమించేది లేదని ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు.
ఈ నెల 8న ఇదే విషయంపై రెండు రోజుల్లో తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన ఏయూ యాజమాన్యం.. నాలుగు రోజులైనా మౌనం వీడక పోవడం వల్ల విద్యార్థులు మరోసారి నిరసన వ్యక్తం చేశారు. జోరుగా వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు.