ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Visaka: ఏడో తరగతి విద్యార్దుల మధ్య కొట్లాట.. ఒకరు మృతి - crime news in vishakha

పాఠశాలలో విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం ఓ ప్రాణాన్ని బలిగొంది. తెలిసీతెలియని వయస్సులో జరిగిన కొట్లాట తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. విశాఖ అక్కయ్యపాలెం జ్ఞాననికేతన్ పాఠశాల సమీపంలో గురువారం విద్యార్థి జశ్వంత్ మృతి కలకలం రేపింది.

student died in kailasapuram vishakhapatnam
student died in kailasapuram vishakhapatnam

By

Published : Oct 1, 2021, 11:31 AM IST

Updated : Oct 1, 2021, 2:38 PM IST

విశాఖ అక్కయ్యపాలెంలోని ఓ ఎయిడెడ్‌ పాఠశాలలో విద్యార్థుల మధ్య వివాదం విద్యార్థి ప్రాణాలను బలిగొంది. తెలిసీతెలియని వయసులో జరిగిన కొట్లాట తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కైలాసపురం ప్రాంతానికి చెందిన రాము రాడ్‌బెండర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జశ్వంత్‌(13) ఆ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే గురువారం పాఠశాలకి వెళ్లిన జశ్వంత్‌కు, తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇక్కడ కాదు పాఠశాల బయట చూసుకుందామంటూ హెచ్చరించుకున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకి పాఠశాల నుంచి జశ్వంత్‌తోపాటు మరో ముగ్గురు బయటకు వెళ్లారు. ఇద్దరు పక్కన ఉండగా మిగతా ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ తగాదాలో జశ్వంత్‌ ఛాతి మీద దెబ్బ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనున్న విద్యార్థులు భయపడి పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. ప్రిన్సిపల్‌ అక్కడికి వెళ్లి చూడగా నోట్లోంచి నురగలు కక్కుతూ జశ్వంత్‌ కనబడటంతో ఫిట్స్‌గా భావించి తాళాల గుత్తిని చేతిలో పెట్టారు. అప్పటికీ సర్ధుకోకపోవడంతో పక్కనున్న ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే శరీరం చల్లబడి ఉండటాన్ని గమనించిన వైద్యులు పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలంటూ సూచించడంతో వెంటనే ఆటోలో మరో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. జశ్వంత్‌ను పరీక్షించిన వైద్యులు మరణించినట్లు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఏసీపీ హర్షితచంద్ర, ట్రాఫిక్‌ ఏడీసీపీ ఆదినారాయణ, ఇతర సిబ్బంది కలిసి కొట్లాట జరిగిన ప్రాంతాన్ని, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రవర్తన తీరుపై ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయ సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ నగర పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన కొట్లాటలో ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు.

ఇదీ చదవండి:భారమయ్యారని ఇంటి నుంచి గెంటివేత... పోలీసులను ఆశ్రయించిన చిన్నారులు

Last Updated : Oct 1, 2021, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details