Vizag Steel Plant Privatization : విశాఖ ఉక్కు పరిశ్రమ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరుణంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్‌గార్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో కొత్త విభాగాలు ప్రారంభించి, స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ అధికారులతో భేటీ అవుతున్నామన్నారు.
ప్రైవేటీకరణ రద్దుని ప్రధాని స్వయంగా ప్రకటించాలి :విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై నమ్మకం లేదని ఉక్కు కార్మిక సంఘం నేతలు అన్నారు. తాత్కలికంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటన చేశారాంటే భవిష్యత్తులో చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేసిన ఈ తాజా ప్రకటన కేంద్ర ఎత్తుగడలో భాగంగా అభిప్రాయపడ్డారు. ఉక్కు ప్రైవేటీకరణని వెనక్కి తీసుకుంటున్నామని క్యాబినెట్ తీర్మానం చేసే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ రద్దుని ప్రధాని స్వయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.