vishaka steel plant praja garjana : విశాఖ ఉక్కు పోరాటానికి రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ఉక్కు ప్రజా గర్జన సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కని.. కేంద్రం హక్కు కాదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో త్రిష్ణా మైదానం మారుమోగింది. పార్టీ జెండాలు వేరైనా... అన్ని పార్టీల అజెండా ఒకటే అంటూ నేతలు స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్రిష్ణా మైదానంలో ‘ఉక్కు ప్రజా గర్జన’ సభ నిర్వహించారు. భాజపా మినహా..13 రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్మిక, ప్రజా సంఘాలు, నిర్వాసిత పోరాట సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఐక్యపోరాటాలకు సిద్ధమవుతున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది. పోరాట కమిటీలు, కార్మిక, నిర్వాసిత సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఉక్కు పరిరక్షణకు ముందుకు వెళ్తామని నినదించింది.
కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్రం అడ్డదారుల్లో నిలువరించాలని చూస్తోందని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. ఈ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు. అందరూ ఐక్యంగా పోరాడే సమయం వచ్చిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం, ప్రైవేటీకరణను అడ్డుకోవడం, మిగిలిన నిర్వాసితులకు శాశ్వత ఉపాధి, ప్లాంటు పూర్తిస్థాయి నిర్వహణకు 6 వేల కోట్ల రూపాయల రుణం తదితర తీర్మానాలను ఆమోదించారు.