ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని కేంద్రం విరమించుకోవాలి' - విశాఖ ఉక్కు పరిశ్రమ వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు, విశ్రాంత ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెంటనే కేంద్రం స్పందించి.. ప్రయత్నాలను విరమింపజేసుకోబోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారంతా హెచ్చరిస్తున్నారు.

steel plant privatisation must be stopped says retired employees
'ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని కేంద్రం విరమించుకోవాలి'

By

Published : Feb 6, 2021, 9:08 AM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు, విశ్రాంత ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నాడు సేకరించిన భూములు

నాడు సేకరించిన భూములు

ఈ ప్రాంతంలో ఉండే 65 గ్రామాలను తరలించి, దాదాపు 22 వేల ఎకరాల పంట భూములను ప్రభుత్వం నాడు స్వాధీనం చేసుకుంది. ఇక్కడి భూముల్లో ఎక్కువగా తాటి చెట్లు, ఉప్పు గల్లీలు ఉండేవి. ఇటు బాలచెరువు నుంచి నడుపూరు శివారు గ్రామాలకు వెళ్లేంత వరకు ఉప్పు గల్లీల్లో కూలీల సందడి కనిపించేది.

నాడు కర్మాగార సమీపంలో ఓ గ్రామం

నాడు కర్మాగారం సమీపంలోని ఓ గ్రామం

2005లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూడు మిలియన్‌ టన్నుల నుంచి 6.3 మిలియన్‌ టన్నులకు విస్తరించే కార్యక్రమ శంకుస్థాపనకు భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వచ్చారు. చిత్రంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని.. ఉక్కు అధికారులను చిత్రంలో చూడొచ్చు.

ఈ పరిస్థితి ఊహించలేదు..

బసా సాధురెడ్డి

ఎందరో ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడిన ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెట్టడం సహించరానిది. ఈ పరిణామంతో భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. 65 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా భూములిచ్చి జాతీయ సంపద ఉక్కుపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎన్నడూ ఊహించలేదు.

- బసా సాధూరెడ్డి, ఉక్కు విశ్రాంత ఉద్యోగి, పెదగంట్యాడ

ఆలోచనను విరమించుకోవాలి:

మాటూరి శ్రీనివాసరావు

కేంద్రం స్పందించి.. వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఎందరికో ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను విక్రయిస్తే... ఎన్నో పేద కుటుంబాలు వీధిన పడతాయి.ప్రైవేటీకరణతో ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, అధికారులు పలు సదుపాయాలు కోల్పోతారు.

-మాటూరి శ్రీనివాసరావు, విశ్రాంత ఉక్కు అధికారుల సంక్షేమ సంఘం సభ్యుడు

నిర్వాసితుల పొట్ట కొట్టొద్దు:

వెంపాడ అప్పారావు

స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితుల పొట్ట కొట్టడానికే ప్రయివేటీకరణ నిర్ణయం తీసుకున్నారు. 16 వేల మంది నిర్వాసితుల్లో సగం మందికే ఉద్యోగాలు కల్పించారు. అందరికీ ఉద్యోగాలు ఇచ్చి, ప్రతి ఆర్‌.కార్డుదారునికి తగిన నష్టపరిహారం ఇచ్చే బాధ్యతను కేంద్రం తీసుకోవాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కేంద్రం వ్యవహరించకపోతే విశ్రాంత ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్వాములవుతాం.

-వెంపాడ అప్పారావు, ఉక్కు విశ్రాంత ఉద్యోగి

జాతీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్తాం:

ఇంద్రసేనారెడ్డి

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా, పరిశ్రమను కాపాడేలా రాష్ట్ర భాజపా శాఖ మద్దతు ప్రకటించడం హర్షణీయం. సెయిల్‌, ఎన్‌ఎమ్‌డీసీ, కేఐఓసీయల్‌తో కలిపి స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించాలి. త్వరలోనే ఈ సమస్యను భాజపా జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి... పరిశ్రమను పరిరక్షిస్తాం.

- పి.ఇంద్రసేనారెడ్డి, భాజపా నగర పార్టీ ఉపాధ్యక్షుడు

మరో ఉద్యమానికి శ్రీకారం :

డాక్టర్​ బూసి వెంకట్రావు

నవరత్న స్థాయి పరిశ్రమ విశాఖ ఉక్కు. దీన్ని విక్రయించాలనుకోవడం అత్యంత దుర్మార్గం. 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడిన కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేస్తే ఊరుకునేది లేదు. త్యాగమూర్తుల స్ఫూర్తిని కొనసాగిస్తూ.. మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం.

-డాక్టర్‌ బూసి వెంకట్రావు, ఉక్కు విశ్రాంత ఉద్యోగి, ఏఐటీయూసీ నాయకుడు

‘జింకు గతే.. ఉక్కుకు పట్టనున్నదా?’

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే జింకు పరిశ్రమకు పట్టిన గతే పడుతుందని, ఈ విషయాన్ని విశాఖ ప్రజలంతా గమనించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టాలని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పల్లా మాట్లాడుతూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జింకు పరిశ్రమను కేంద్రం వేదాంత సంస్థకు విక్రయించిందన్నారు. ఆ సంస్థ జింకును నడపలేక, ఆ భూముల్లో స్తిరాస్థి వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కులో 25 శాతం వాటాను రూ.500 కోట్లకు విక్రయించాలనే ప్రతిపాదన వచ్చిందని గుర్తు చేశారు. అప్పటిలో ఆ వాటాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ప్రస్తుతం కూడా వైకాపా ప్రభుత్వం ఆయా వాటాలను కొనుగోలు చేసి ప్లాంట్‌ను నడపాలని డిమాండ్‌ చేశారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టీఎన్‌టీయూసీ కార్మిక వర్గాన్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.

పార్టీ కార్యాలయానికి ఇటీవల జీవీఎంసీ జారీ చేసిన జప్తు నోటీసు ఆధారంగా ఆస్తి పన్ను బకాయిలు రూ.17లక్షలు జమ చేశామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తాము నిబంధనల ప్రకారం వెళుతున్నా ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడికి తలవంచి జీవీఎంసీ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ నాయకులు నజీర్‌, ప్రణవగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీలను అడ్డుకునే ప్రయత్నం

విశాఖ ఎంపీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతిలను అడ్డుకోవడానికి తెదేపా, వామపక్షాల పార్టీల నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని పక్కకు తొలగించారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన సభకు హాజరై కారు ఎక్కేందుకు ఎంపీలిద్దరు వస్తుండగా.. ఉక్కు కర్మాగారం పరిరక్షణకు సహకరించాలని నినాదాలు చేస్తూ తెదేపా, వామపక్షాల నేతలు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఎంపీల కార్లకు ఏఐటీయూసీ నాయకులు అడ్డుగా రాగా పోలీసులు వారిని పక్కకు లాగేశారు.

ఇదీ చదవండి:

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసనలు

ABOUT THE AUTHOR

...view details