విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు జిల్లాల్లో అందోళనలు చేపట్టారు. ప్రైవేటీకరణ అంశంపై రాజకీయాలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు సూచించారు.
విశాఖ జిల్లా...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు జీవీఎంసీ గాంధీ పార్కులో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయంతో వేలాది మంది కార్మికులకు అన్యాయం చేసి కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణపై అన్ని వర్గాలు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంటే... మొండిగా అదే పని చేయడంలో కేంద్రం తీరు ఏమిటో అర్థం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
కడప జిల్లాలో...
విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమం ఓట్ల కోసం కాదని... రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మాజీఅధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వమే నిర్మించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ... కడపలో ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ఏళ్ల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వారికి అప్పగించడం.. దానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితులలో విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లాలో...
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని... రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణ సమీపంలో ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాజకీయాలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మొదటి నుంచి చెప్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి