విత్తనాలు మొలకెత్తకపోతే రైతులెవరూ అధైర్యపడవద్దని, వారికి కొత్తవి ఇస్తామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ జి. శేఖర్‌బాబు తెలిపారు. 'మొలకెత్తని వరి విత్తనాలు' శీర్షికన బుధవారం ఈనాడు- ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. విశాఖ జిల్లా వ్యవసాయాధికారులతో కలిసి గురువారం వడ్డాది కస్సా పొలాల్లో వరి నారుమళ్లను పరిశీలించారు. ఇప్పటికే విత్తనాలు జల్లుకుని నష్టపోయిన వారిని కూడా ఆదుకుంటామని చెప్పారు.
మొలక శాతం 50 కంటే తక్కువ ఉంటే విత్తనాలు పూర్తిగా ఇస్తామన్నారు. 50 నుంచి 80 శాతం మధ్య మొలక శాతం వచ్చిన వాటికి ఇద్దరు రైతులకు కలిపి ఒక బస్తా విత్తనాలు ఇస్తామని పేర్కొన్నారు. ఒక ఆర్జీఎల్ రకం విత్తనాల్లోనే కొన్ని చోట్ల ఈ సమస్య వచ్చిందన్నారు. వడ్డాదిలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులతో సమావేశం నిర్వహించారు. కియోస్క్ యంత్రాల్లో రైతుల వివరాలను నమోదు చేసుకుంటే ఎరువులు, పురుగులు వంటి వాటిని కూడా తీసుకువచ్చి 48 గంటల్లో అందిస్తారని ఎండీ తెలిపారు. యంత్రాలను కూడా అందుబాటులో ఉంచి రైతులకు అద్దెకు ఇస్తాన్నారు. వ్యవసాయశాఖ జేడీ లీలావతి, చోడవరం ఏడీఏ శంకర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి రూప, ఇతర సిబ్బంది, వైకాపా నాయకుడు దొండా నారాయణమూర్తి, రైతులు పాల్గొన్నారు.