ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ పంటలకు సీలేరు నుంచి నీటి విడుదలపై.. జలవనరులశాఖ బృందం విశాఖపట్నంలోని సీలేరు కాంప్లెక్స్‌లో పర్యటించింది. రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేకాధికారి, ముఖ్య ఇంజినీర్ సతీశ్ ఆధ్వర్యంలోని ఈ బృందం.. తొలుత డొంకరాయి జలాశయంను, గోదావరి డెల్టాకు విడుదలవుతున్న నీటిని పరిశీలించారు. అనంతరం సీలేరుకు చేరుకుని జెన్‌కో ఎస్ఈ రామకోటిలింగేశ్వరరావుతో పాటు ఇతర అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్‌లో ఉన్న నీటి నిల్వలు.. రబీపంటలకు విడుదల చేస్తున్న జలాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
12 వేల క్యూసెక్కులు కావాల్సిందే...
సీలేరులో విద్యుదుత్పత్తి అనంతరం జలాశయం నుంచి సుమారు ఆరువేలు క్యూసెక్కులు నీరు వస్తున్నా పంటలకు సరిపోవడం లేదని.. జలనవరులశాఖ బృందానికి స్థానిక అధికారులు తెలిపినట్లు సమాచారం. రోజుకు సుమారు 12వేలు క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం సీలేరులో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నా.. జెన్‌కో కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే నీరు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్ఈ తెలిపారు.