YCP Government Diverted PMGSY Funds: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన..పీఎమ్జీఎస్వైకి సంబంధించిన రెండో విడతలోని రెండు కేటగిరీల నిధులు 144.68 కోట్లను రాష్ట్రానికి కేంద్రం అక్టోబరు 31న కేటాయించింది. దీనికి తన వాటా 110 కోట్లను కలిపి మొత్తం 254.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయడం లేదు. కేంద్రం నుంచి నిధులు వచ్చిన 21 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థ..ఎపీఎస్ఆర్ఆర్డీఎ.. సింగిల్ నోడల్ ఖాతాకి జమ చేయాలన్న నిబంధననూ రాష్ట్రం గాలికొదిలేసింది. దీంతో పనులు చేసిన గుత్తేదారులకు రూ.250 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
పీఎమ్జీఎస్వై నిధులు రాష్ట్రానికి కేటాయిస్తున్నా విడుదలలో జాప్యం చేస్తుండటంతో కేంద్రం కొత్తగా షరతు విధించింది. రెండో విడతలో ఇప్పటికే కేటాయించిన నిధులకు రాష్ట్ర వాటాను కలిపి డిసెంబరు నెలాఖరులోగా మొత్తం విడుదల చేయాలని, నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లను తమకు పంపితేనే.. మూడో విడత ఇవ్వాల్సిన 149 కోట్లను కేటాయిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పీఎమ్జీఎస్వై పనుల పురోగతిపై ఈనెల 7న కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన సమీక్షలో పలు రాష్ట్రాలు కేంద్రం నిధులను సొంతానికి వాడుకున్న విషయం ప్రస్తావన కొచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా వచ్చింది.