YSRCP Government On Visakha Capital : విశాఖ కార్యనిర్వాహక రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని చేస్తామని ఇన్నాళ్లూ చెబుతున్న జగన్ ప్రభుత్వ నైజం.. బెంగళూరు వేదికగా బయటపడింది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ప్రచారం కోసం నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులన్నది అవాస్తవమని స్పష్టంచేశారు. విశాఖ ఒక్కటే రాజధాని అన్నారు. అమరావతి పేరు కూడా ఆయన నోట రాలేదు. కర్ణాటక తరహాలో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. పారిశ్రామిక వృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదన్న పారిశ్రామికవేత్తల ప్రశ్నకు సమాధానంగా.. రాజధాని అంశాన్ని బుగ్గన ప్రస్తావించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాగే విశాఖను ఐటీ రంగానికి చిరునామాగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఏపీ తదుపరి రాజధానిగా విశాఖను మా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న సమాచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకోడానికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలే కారణం. భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓడరేవు నగరంగా ఇప్పటికే గుర్తింపు ఉన్న విశాఖ.. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అక్కడి కాస్మోపాలిటన్ సంస్కృతి, వాతావరణం కూడా రాజధానికి అనువుగా ఉంటాయి.
న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి అంటూ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని.. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్, గుంటూరులో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కర్నూలు రాజధాని కాదు. అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుంది. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఒక హైకోర్టు బెంచి, గుల్బర్గాలో మరో బెంచి ఉన్నాయి. ఇలాగే కర్నూలులో ఏర్పాటుచేస్తున్నాం. ఈ నిర్ణయానికి కారణం ఏమిటంటే.. వందేళ్ల చరిత్రను గుర్తుచేసుకోవాలి. 1937నాటి శ్రీభాగ్ ఒప్పందం గురించి చెప్పుకోవాలి. బ్రిటిష్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. పాలనా రాజధాని ఒకచోట, కోర్టు మరోచోట ఉండాలని నిర్ణయించారు. అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యం ఉండేలా చూడాలని అప్పట్లో ఈ నిర్ణయం జరిగింది. ఆ ప్రకారమే కర్నూలులో ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం.