ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SPECT In Vizag: సాధారణ ఉపాధ్యాయిని... అసాధారణ ఉద్యమ స్ఫూర్తికి నాంది - సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్‌ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్‌- స్పెక్ట్‌

SPECT In Visakhapatnam: ఓ సాధారణ ఉపాధ్యాయురాలైన ఆమె తన ఉద్యోగ జీవితం మొదలైన నాటి నుంచే సమాజ హితం కోసం తపించారు. ఆ సంకల్పంతోనే వందల మంది బాలికలు, అనాథ విద్యార్థులకు అండగా నిలిచారు. అవయవదానాలను జాతీయోద్యమ స్థాయికి తీసుకెళ్లారు. సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆమె ఎవరో మనము తెలుసుకుందామా?

SPECT In Visakhapatnam
సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్‌ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్‌

By

Published : Mar 7, 2022, 4:33 PM IST

SPECT: తెలుగు రాష్ట్రాల్లో అవయవదానం, దేహదానంపై అవగాహన ఉన్నవారికి గూడూరు సీతామహాలక్ష్మి పరిచయం అక్కర్లేదు. ఓ సాధారణ ఉపాధ్యాయిని అయిన ఆమె.. అసాధారణ ఉద్యమ స్ఫూర్తికి బాటలు వేశారు. 4 దశాబ్దాల క్రితం ఉపాధ్యాయినిగా బాధ్యతలు చేపట్టిన సీతామహాలక్ష్మి.. తొలి నెల జీతం నుంచే సమాజానికి ఎంత ఇవ్వగలను అనే దృక్పథంతో సేవాబాట పట్టారు. పాఠశాలలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో తనకు కనిపించిన పిల్లలను బాగా చదువుకునేలా తీర్చిదిద్దడమే ఆమె చేపట్టిన తొలి పని. ఇలా వందల మంది విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పారు. పాస్‌ మార్కులు కూడా పొందలేనివారిని సమాజంలో ఉన్నత స్థితికి చేర్చారు.

సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్‌ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్‌

అవమానాలను దాటుకొని..

'మరణించినా జీవించండి' అన్న నినాదంతో శరీర, అవయవదాన ఉద్యమం కోసం పడ్డ శ్రమ, ఎదురైన అవమానాలు.. ఆమెను రాటుదేల్చాయి. భావసారూప్యం ఉన్నవారిని ఏకం చేసేలా ఆమె పడ్డ కష్టానికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. మృతదేహాలు భావితరం వైద్యులకు ప్రయోగశాలగా ఉపకరిస్తాయని నమ్మిన ఆమె.. అపోహలు, ఆంక్షలను దూరం చేసేందుకు శ్రమించారు. ఆమె స్ఫూర్తితో ఆంధ్ర వైద్య కళాశాలకు అవయవదానం చేయడానికి ఒకేసారి 35 మంది ముందుకు రావడం జాతీయస్థాయిలో ముఖ్య ఘట్టంగా నిలిచింది. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవదానాన్ని ఇదే స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆమెదే. ఒకటిన్నర దశాబ్దం క్రితం ఆమె ఏర్పాటు చేసిన సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్‌ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్‌- స్పెక్ట్‌ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు.. భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

సీతామహాలక్ష్మి కృషితో స్ఫూర్తి పొందిన ఎంతో మంది మహిళలు ఆమె అడుగులో అడుగులు వేయడానికి ముందుకొచ్చారు. స్పెక్ట్‌తో పాటు, సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతున్నారు. అన్ని విషయాల్లోనూ ఆమెకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఆమె కృషి దాతలను కదిలించింది. కొంతకాలం కిందటి వరకు ఎలాంటి నిధులూ లేని స్పెక్ట్‌కు కొద్ది నెలల్లోనే దాతలు దాదాపు 20 లక్షల రూపాయలు సమకూర్చారు. తన నివాసాన్నే స్పెక్ట్‌ కార్యకలాపాలకు వినియోగిస్తూ వస్తున్న సీతామహాలక్ష్మికి స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి తనకున్న చిన్నపాటి స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.

సీతామహాలక్ష్మీ, ఆమె బృందం చేస్తున్న కృషి ఫలితంగా వేల సంఖ్యలో రక్తదాతలు, అవయవ దాతలు స్పెక్ట్‌తో అనుసంధానమయ్యారు. కష్టంలో ఉన్నవారి కోసం మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. ఇక విశాఖలో కామన్‌ స్కూల్, కామన్‌ కిచెన్‌, కామన్‌ హౌస్ నడపాలన్నదే తమ ఆశయమని చెబుతున్నారు.

ఇదీ చదవండి: Murder: తూర్పుగోదావరి జిల్లాలో తండ్రిని హత్య చేసిన తనయుడు

ABOUT THE AUTHOR

...view details