ఇటీవల వచ్చిన వెబ్‌సిరీస్‌ల్లో 'సాఫ్ట్‌వేర్ డెవలపర్' ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. అందులో వచ్చే ప్రేమ, బ్రేకప్ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం, నువ్వే నేనే పాట కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది. ఆ సంగీతం మాయ వెనక దాగి ఉన్న కుర్రాడు.... సుమన్ వంకర. ర్యాప్, పాప్, లవ్ అనే తేడా లేకుండా అన్ని రకాల బాణీలు రూపొందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో సంగీత సంచలనంగా మారాడు.
విశాఖ షీలానగర్‌కు చెందిన వంకర సుమన్.. ఉక్కు కార్మగారం ఉద్యోగి సత్య నారాణయణ, సత్యవేణిల కుమారుడు. సుమన్ 9వ తరగతి నుంచే పాటలు రాయడం మెుదలుపెట్టాడు. తరగతి గదిలో చివరి బెంచీల్లో కూర్చునే విద్యార్థులు ఎదుర్కొనే వివక్ష గురించి తొలి పాట రాసి ప్రశంసలు అందుకున్నాడు. ఆ ప్రోత్సాహంతోనే రచయితగా స్థిరపడాలనే కోరిక సుమన్‌కు కలిగింది.
తప్పని సినిమా కష్టాలు..
తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంటర్ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్లాడు. కానీ, అవకాశాలు లభించలేదు. ఇండస్ట్రీలో అవకాశాలు అంత సులువుగా లభించవని గ్రహించిన సుమన్... విశాఖకు తిరిగి వచ్చాడు. అయినప్పటికీ... పాటలు రాయడానికి ఏ మాత్రం దూరం కాలేదు. కసితో ఇంకా ఎక్కువగా రాయడం మెుదలుపెట్టాడు.
ప్రేమ గీతాలతో మెప్పించి..
రచనతో పాటు సంగీతం సమకూర్చి తొలిసారిగా 2012లో ప్రేమిక ఆల్బమ్ విడుదల చేశాడు .. సుమన్ వంకర. అలాగే, స్నేహితుల కోసం ప్రేమ గీతాలు రాసేవాడు. వాటికీ మంచి స్పందన లభించడంతో నగరవ్యాప్తంగా సుమన్‌తో పాటలు రాయించుకునే వారు పెరిగిపోయారు. ప్రేమించిన వారి పేరు, స్వభావం చెబితే చాలు... వారికి తప్ప మరొకరికి అంకితమవ్వలేని విధంగా పాటలు రూపొందిస్తున్నాడు.