విశాఖ రుషికొండ బీచ్.. సర్ఫింగ్ క్రీడాకారుల్ని ఆకర్షిస్తోంది. తూర్పు తీరంలో ఇలాంటి క్రీడకు అవకాశం ఉన్న కొద్ది ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న రుషికొండ తీరాన్ని స్థానిక యువత సద్వినియోగం చేసుకుంటున్నారు. విదేశాల్లో ఎంతో ఆదరణ కలిగిన ఈ సాగర క్రీడ విశాఖ యువతకు చేరువైంది. అనుదీప్ ఆండీ శిక్షణా సారథ్యంలో ఎక్కువగా మత్స్యకార యువత సర్ఫింగ్ లో సత్తా చాటుతున్నారు.
అలలపై నిలబడి తీరం వైపుగా కదలడం... ఆ సమయంలో తీర ప్రాంత అందాలను ఆస్వాదించడం గొప్ప అనుభూతి అని యువ సర్ఫింగ్ క్రీడాకారులు అంటున్నారు. ఈ క్రీడ నేర్చుకోవడం ద్వారా తమ భవిష్యత్తుకి ఓ భరోసా దొరికిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.