విశాఖలో 45 రోజుల నటశిక్షణ శిబిరం Rangasai Drama Library: విశాఖలోని రంగసాయి నాటక సంఘం, నవరస థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా.. రంగస్థల శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. ముందుగా పత్రికల్లో ప్రకటన ఇచ్చి.. వచ్చిన దరఖాస్తులను నుంచి ఎంపిక చేసిన వారికి శిక్షణ అందిస్తున్నారు. విశాఖ టీఎస్ఆర్ కాంప్లెక్స్‌లోని రంగసాయి నాటక గ్రంథాలయంలో 45 రోజుల నటశిక్షణ శిబిరం కొనసాగుతోంది.
Theatre Action Workshop: ఒక సామాన్య వ్యక్తికి సైతం రంగస్థలంపై పూర్తిస్థాయి నటునిగా రూపొందేందుకు అనువుగా శిక్షణ రూపొందించామంటున్నారు నిర్వాహకులు. ఒక సన్నివేశాన్ని రంగస్థలానికి అనుగుణంగా అప్పటికప్పుడు రూపొందించడం, రంగస్థలాన్ని ఇతివృత్తాలకు అనుగుణంగా వినియోగించుకోవడం, ఉచ్ఛారణ, రసాలకు అనుగుణంగా గళాన్ని వినిపించడం వంటి అనేక అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
రంగసాయి నాటక సంఘం, నాటక గ్రంథాలయం వ్యవస్థాపకుడు బాదంగీర్ సాయి ఈ నట శిక్షణ శిబిరం ఏర్పాటుకు చొరవ చూపారు. తాను నిర్వహిస్తున్న నాటక గ్రంథాలయాన్ని వేదికగా ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులకు నిత్యం అందుబాటులో ఉంటూ శిక్షణ విజయవంతం అయ్యేందుకు సాయి కృషి చేస్తున్నారు. లబ్ధప్రతిష్టులైన నటులు, ప్రయోక్తలను రప్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు.
45 Days Theatre Action Workshop at Vishaka: శిక్షణ శిబిరానికి యువత ఉత్సాహంగా హాజరవుతున్నారు. ఇప్పటికే శిక్షణలో సగం రోజులు గడవడంతో నాటక క్రమశిక్షణకు అలవాటు పడ్డారు. వివిధ రంగాల్లో పని చేస్తున్నవారు సైతం నటన పట్ల అభిరుచితో శిక్షణ తీసుకుంటున్నారు. నాటకం వినోదానికే కాదు, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాహార కళగా అనేక కళారంగాలను తనలో నింపుకున్న నాటక రంగం ఆదరణ కోల్పోతోందని నిరాశ కబుర్లు చెప్పేవారికి ఈ శిక్షణ శిబిరం ఒక జవాబు అంటున్నారు నిర్వాహకులు.
ఇదీ చదవండి:చంద్రబాబుకు మాత్రమే సైకో పాలనలా కనిపిస్తోంది : మంత్రి పెద్దిరెడ్డి