Special Status Yatra: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం, భవిష్యత్తు తరాల కోసం తాము జరుపుతున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని.. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలకు తెర తీయొద్దని కోరారు. దిల్లీలో ప్రధాని కార్యాలయం ముందు రాష్ట్ర ఎంపీలంతా ధర్నా చేయాలన్నారు. ఈ చర్యల ద్వారా తప్పనిసరిగా హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తీరుతాయన్నారు. హిందుపురం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టే 2.0 యాత్రలో విద్యార్ధి, యువజన సంఘాలన్నీ పాల్గొంటున్నాయని, రాజకీయాలకు ప్రమేయం లేకుండా ఈ యాత్రలో అందరూ పాల్గొని, ప్రత్యేక హోదా ఆకాంక్షను తెలియజేద్దామని పేర్కొన్నారు.
ఈ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆంధ్రుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన కేసీఆర్ క్షమాపణలు చెప్పి, తన పార్టీ విస్తరణ కోసం రాష్ట్రానికి రావాలని, ఉమ్మడి ఆస్తుల విభజన కోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు విషయంలో అన్ని పార్టీలు ఒక్క మాటపైకి వస్తే కొనేందుకు ఎవ్వరూ దరిదాపులలోకి రాలేరని, ఇందుకోసం అధికార పక్షం తప్పనిసరిగా కలిసి రావాలన్నారు.