విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అప్పారావు నివాసంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి యజమానురాలు అప్పారావు భార్య మహేశ్వరి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
అద్దె నివాసంలో..
ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఆదిరెడ్డి పాలెంకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అప్పారావు కుటుంబం అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అప్పారావు భార్య మహేశ్వరి తమ వంటగదిలో ఇండియన్ గ్యాస్ కొత్త సిలిండరుకు కనెక్షన్ అమర్చేందుకు యత్నించారు. ఆ సమయంలో ఇండియన్ గ్యాస్ కంపెనీకి చెందిన సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడాన్ని మహేశ్వరి గుర్తించారు. ఫలితంగా పక్కనే ఉన్న హరిత హోమ్ నీడ్స్ వద్ద గల రాయపూర్ అగ్రహారానికి చెందిన అప్పారావు, గంగరాజులను సాయం కోసం పిలిచారు.
ఆదుకుందామని వస్తే..
ఆపదలో ఆదుకుందామని వచ్చిన ఆ ఇద్దరు యువకులు వచ్చి మహేశ్వరితో పాటు లీకువుతోన్న గ్యాస్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సిలిండక్ నాబ్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంట గదిలోని గౌరీ మహేశ్వరి, ఆమె కుమార్తె అమూల్య, పక్కింటిలో నివాసం ఉంటున్న నేహా సహా అప్పారావు, గంగరాజులు బయటకు వచ్చే క్రమంలో పెద్ద శబ్దంతో సిలిండర్ పేలింది.