Sirivennela Seetarama Sastry Samagra Sahitya Book:విశాఖలో వై.వి.ఎస్. మూర్తి ఆడిటోరియం వేదికగా పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని పుస్తకాలను అవిష్కరించారు. "నా ఉచ్చ్వాసం కవనం" పేరిట సంపుటిని ఆవిష్కరించారు. తానా ప్రపంచసాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహిత్యం కోసం తెలుగు సినిమాలు చూసేలా చేసిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని ఎన్.వి రమణ కొనియాడారు. ఆయన పాటల్లో వినియోగించిన తెలుగు భాష తీరు అద్భుతమన్నారు.
"సిరివెన్నెల పాటలను గ్రంథ రూపంలో తేవడం హర్షణీయం. గురజాడ, శ్రీశ్రీ వంటి వారు నాకు స్ఫూర్తి. తెలుగు సాహిత్యం, భాషకు సిరివెన్నెల గుర్తింపు తెచ్చారు. పాటల కోసమే సినిమాలు చూడాలనిపించేలా సిరివెన్నెల పాటలు రాశారు. సిరివెన్నెల పాటలను వింటే ప్రశాంత కలిగేది. చెడు సంకేతాలు ఇచ్చే సాహిత్యం జోలికి సిరివెన్నెల వెళ్లలేదు. సిరివెన్నెల పాటల్లో సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. రాష్ట్రం విడిపోయాక తెలుగు సాహిత్య సమావేశాలు తగ్గిపోయాయి" -జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి