లాక్ డౌన్ ప్రభావానికి వర్షాకాలం తోడు కావడం విద్యుత్తు డిమాండ్ పడిపోవడం ఇప్పుడు థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు గిరాకీ తగ్గిపోయింది. విశాఖ జిల్లాలోని పరవాడలో ఎన్టీపీసీకి ఉన్న అతి ముఖ్యమైన యూనిట్లలో సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి. 2 వేల మెగావాట్ల సామర్ధ్యం గల ఈ పవర్ స్టేషన్లో 4 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్లు ఈనెల మొదటి వారం వరకు పూర్తిస్ధాయిలోనే పనిచేశాయి. 10 రోజుల కిందట ఒకటో యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపారు. 18వ తేదీన 3, 4 యూనిట్లు రెండింటిలోనూ విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేశారు. విద్యుత్తు డిమాండ్ గణనీయంగా తగ్గడం వల్లనే ఎన్టీపీసీ సింహాద్రి ఈ చర్యలు చేపట్టింది.
సింహాద్రిలో ఉన్న 1, 2 యూనిట్లు వెయ్యి మెగావాట్ల విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్‌కి 461 మెగావాట్లు, తెలంగాణకి 539 మెగావాట్లను కేటాయించారు. అంటే 46.1 శాతం ఆంధ్రప్రదేశ్‌కి, 53.9 శాతం తెలంగాణకి పంచారు. ఇప్పుడు ఈ 2 యూనిట్లలో కేవలం ఒకటి మాత్రమే 500 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇది కూడా ఆ దామాషా ప్రకారమే 2 రాష్ట్రాలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. 3, 4 యూనిట్లలో ఉత్పత్తి అయ్యే 1000 మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా వాటా ఉంది. తెలంగాణకి 245 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కి 209.6 మెగావాట్లు, తమిళనాడు 224.8, కర్ణాటక 212.3, కేరళ 91.5, పుదుచ్చేరి 16.7 మెగావాట్ల కేటాయింపులు ఉన్నాయి. ఈ 3, 4 యూనిట్లు రెండింటిలోనూ విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేశారు.