విశాఖ సింహాచలం పాలకమండలి సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు... కీలక తీర్మానాలు చేసింది. బోర్డు చైర్మన్ సంచిత గజపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానాలను పాలక మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. భక్తులకు అందించే అన్నప్రసాదం రుచిగా ఉండేలా పర్యవేక్షణ చేసేందుకు నైపుణ్యత కలిగిన ఏజెన్సీని నియమించుకోవడం, స్వామివారి ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు, సింహగిరిపై పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ప్రతిపాదనలు.. అన్నవరం తరహలో దేవస్థానంలో పెళ్లి మండపాలు ఏర్పాటు చేసి ఆదాయాన్ని సమాకూర్చుకోవటం వంటి తీర్మానాలను చేశారు.
ఈ నెల 10 వ తేదిన మరోసారి సమావేశం కావాలని పాలక మండలి నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో దేవస్థానంలో గత ఏడాది మార్చిలో నిలిపివేసిన నిత్య అన్నదాన పథకానికి వితరణ తిరిగి కొనసాగించాలని దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానంలో సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 2500 మంది, సాయంత్రం 200 మందికి అన్నప్రసాదం వడ్డించేవారు. అయితే.. శని, ఆదివారాల్లో 5000 మందికి, ఉత్సవాల్లో అపరిమిత సంఖ్యలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో వెంకటేశ్వరరావుతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.