Simhachalam Giri Pradakshina: సింహగిరి ప్రదక్షిణను ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు కొండ దిగువన తొలి పావంచా నుంచి భక్తులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ స్వామి పాదాల వద్ద కొబ్బరికాయ కొట్టి పరిక్రమణకు శ్రీకారం చుడతారు. అధికారికంగా స్వామివారి పుష్పరథం మధ్యాహ్నం ప్రారంభం కానుండగా.. ఉదయం నుంచే భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు.
తొలిపావంచా నుంచి భక్తులు పాత అడివివరం, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం, ముడసర్లోవ, హనుమంతువాక, విశాలాక్షినగర్, అప్పుఘర్.. వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్‌ఏడీ కూడలి, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం మీదుగా.. ప్రదక్షిణ చేస్తూ తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మెట్లమార్గం ద్వారా సింహగిరి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు.
"నేను ఎనిమిది సంవత్సరాలుగా గిరి ప్రదర్శన చేస్తున్నాను. ఈ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి.. ఏమైనా కోరుకుంటే.. కోరికలు నెరవేరుతాయి". - భక్తురాలు
"ఉదయం స్వామి వారిని దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు గిరి ప్రదర్శనకు స్టార్ట్ అయ్యాము.చాలా బాగుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా.. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎండ ఎక్కువగా ఉన్నా సరే భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు". - భక్తుడు
గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు అల్పాహారాలు అందించేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు, యువజన సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు సిద్ధమయ్యాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గిచేందుకు ఎక్కడికక్కడ మంచి నీటిని అందించేందుకే జీవీఎంసీ ఏర్పాట్లు చేసింది.
"మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం. చాలా మంది వస్తున్నారు. ప్రతి సంవత్సరం జనం పెరుగుతూనే ఉన్నారు". - భక్తురాలు
"మేము ఇక్కడకి రావడం ఇదే మొదటి సారి. మేము కాకినాడ నుంచి వచ్చాము. ఇక్కడ అంతా బాగానే ఉంది. తొలి మెట్టు నుంచి మేము స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఎండ కొంచం ఎక్కువగా ఉంది.. కానీ ఎర్పాట్లు అన్నీ బాగా చేశారు". - భక్తురాలు
మధ్యాహ్నం రెండు గంటలకు తొలి పావంచా నుంచి గిరి ప్రదక్షిణ లాంఛనంగా ప్రారంభమైంది. 32 కిలోమీటర్ల ఈ ప్రదక్షిణలో.. పౌర్ణమి నాడు నిండు చందమామను పోలిన స్వామి పరిపూర్ణ రూపాన్ని దర్శించుకుని మనసులోని కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 32 కిలోమీటర్ల ప్రదిక్షిణ పూర్తి చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
"మేము ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్.. ఎమ్ఎమ్ఎస్ఎమ్ డిపార్ట్మెంట్ తరఫున.. లక్ష మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నాం. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి యత్నిస్తుండటంతో.. దానిని ప్రైవేటీకరణ చేయకూడదని స్వామి వారిని కోరుకుంటున్నాం. భక్తులకు అందరికీ కూడా దీని గురించి తెలియజేస్తున్నాం". - ప్రసాదం వితరణ నిర్వాహకులు
సింహాచలం గిరి ప్రదక్షిణకు.. భారీగా తరలివచ్చిన భక్తులు