విశాఖ జిల్లాలోని సింహాచలంలో కొలువుదీరిన శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారికి ఈనెల 16 నుంచి వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈనెల 16న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 20న ఏకాంత స్నపనంతో పరిసమాప్తమవుతాయని వివరించారు.
శ్రీ స్వామి వారి ఉత్సవమూర్తులైన త్రిగోవిందరాజస్వామి, అమ్మవార్లు కళ్యాణ మండపంలో విశేష ఉత్సవము జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఈ పవిత్రోత్సవాల్లో విశేష హోమాలు, వేదపారాయణలు, దివ్య ప్రబంధ సేవాకాలము, తిరునిధి ఉత్సవములు జరుగుతాయని వివరించారు. ఈ కాలంలో ఉదయం ఆరాధన తర్వాత విశేషమైన హోమాలు, పూర్ణాహుతి జరుగుతాయని అర్చకులు తెలిపారు. పవిత్ర అలంకృతుడైన స్వామి వారిని సేవించిన భక్తులు ఆయన అనుగ్రహం పొందుతారన్నారు.